‘మిలిటెంట్’ వ్యాఖ్యల వివాదం.. బాల్క సుమన్ అరెస్ట్
తెలంగాణ రాజకీయాలు మరోసారి ఉత్కంఠకు వేదికయ్యాయి. బీఆర్ఎస్ కీలక నేత బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ భవన్ కేంద్రంగా సాగిన హైడ్రామా, పోలీసుల మోహరింపు, బీఆర్ఎస్ శ్రేణుల నినాదాల మధ్య ఈ అరెస్ట్ ప్రక్రియ ముగిసింది. సింగరేణి బొగ్గు గని కార్మికుల సమావేశంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఈ పరిణామాలకు ప్రధాన కారణం కాగా, ఈ వ్యవహారం ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ యుద్ధానికి దారితీసింది.
ఇటీవల నిర్వహించిన సింగరేణి బొగ్గు గని కార్మికుల సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి. “సింగరేణిని తగులబెట్టండి… మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి.. డబ్బులు కావాలంటే ఆఫీస్‌లను తగలబెట్టాలి” అంటూ ఆయన పిలుపునివ్వడం శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందనే విమర్శలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై ఆనంద్ అనే వ్యక్తి నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు బాల్క సుమన్‌పై అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ప్రేరేపించడం, ప్రజా ఆస్తుల నష్ట నివారణ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ సెక్షన్ల తీవ్రత దృష్ట్యా, నేరం నిరూపితమైతే దాదాపు పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇవి నాన్-బెయిలబుల్ కేసులు కావడంతో పోలీసులకు ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది.
మిలిటెంట్ వ్యాఖ్యల అనంతరం తనపై కేసు నమోదైందని, అరెస్ట్ ఖాయమని గ్రహించిన బాల్క సుమన్ గత మూడు రోజులుగా తెలంగాణ భవన్‌నే తన ఆవాసంగా మార్చుకున్నారు. ఆయన బయటకు రాగానే అరెస్ట్ చేయాలని పోలీసులు గట్టి వ్యూహం రచించారు. ఇందులో భాగంగానే తెలంగాణ భవన్ వెలుపల భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అరెస్ట్ చేయడానికి పోలీసులు లోపలికి ప్రవేశించిన సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు, లాయర్లు పోలీసులతో భారీ వాగ్వాదానికి దిగారు. “పోలీస్ గో బ్యాక్” అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రశ్నించగా.. ఇవి నాన్‌బెయిల్‌బుల్ కేసులు కాబట్టి నోటీసులతో పనిలేదని పోలీసులు స్పష్టం చేస్తూ, తీవ్ర ఉద్రిక్తత మధ్య ఆయన్ని స్టేషన్‌కు తరలించారు.
అరెస్టుకు కేవలం కొద్ది నిమిషాల ముందు బాల్క సుమన్ మీడియా సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ అరెస్ట్ వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను, సింగరేణిలో జరుగుతున్న వందల కోట్ల కుంభకోణాలను, వారసత్వ ఉద్యోగాల విషయంలో ఇచ్చిన మాట తప్పడాన్ని నేను ప్రశ్నిస్తున్నందుకే నన్ను టార్గెట్ చేశారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి కుట్రపూరితంగా నన్ను జైలుకు పంపి పైశాచికానందం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా తనపై గతంలోనే 250కి పైగా కేసులు ఉన్నాయని, జైలుకు వెళ్లడం తనకు కొత్తేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ అణిచివేతలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
బాల్క సుమన్ అరెస్టును బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ అధికార పక్షం కావాలని బనాయించిన అక్రమ కేసులని ఆ పార్టీ లాయర్లు వాదిస్తున్నారు. ఈ అరెస్ట్‌పై న్యాయపరంగా పోరాటం చేస్తామని, బెయిల్ కోసం త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రకటించింది. మొత్తంగా, సింగరేణి కార్మికుల సమస్యల నేపథ్యంగా మొదలైన ఈ వివాదం, బాల్క సుమన్ చేసిన మిలిటెంట్ వ్యాఖ్యలతో రాజకీయ రంగు పులుముకుంది.







