రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే అంకెలే కాదు.. నిపుణులు చెప్తున్న అసలు లెక్కలివే!
Retirement Planning: నెలవారీ ఖర్చులు రూ.2 లక్షలు ఉన్న 40 ఏళ్ల వ్యక్తి, తన 60వ ఏట పదవీ విరమణ చేయాలనుకుంటే.. దాదాపు రూ.40 కోట్ల రిటైర్మెంట్ ఫండ్ అవసరమవుతుందంటూ ‘డిటో’ సహ వ్యవస్థాపకుడు సందీప్ జైత్వాని చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధి అవసరమా అనే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, పదవీ విరమణ అనేది కేవలం ఒక సంఖ్యకు పరిమితమైన అంశం కాదు. ఇందులో ఆర్థిక గణనలతో పాటు సామాజిక, భావోద్వేగ కోణాలు కూడా ముడిపడి ఉంటాయి. రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకునేటప్పుడు జీవిత వృద్ధాప్యంలో జీవనశైలి ఎలా ఉండాలనేది ముందే ఊహించుకోవాలి. ఎందుకంటే 58 ఏళ్ల వయసులో ప్రయాణాలపై ఉండే ఆసక్తి, 70 ఏళ్లకు వచ్చేసరికి ఆరోగ్య సంరక్షణ వైపు మళ్లుతుంది.
వైద్య ఖర్చులు..
పదవీ విరమణ ప్రణాళికలో ద్రవ్యోల్బణం అతిపెద్ద సవాల్‌గా మారుతుంది. సాధారణ ద్రవ్యోల్బణం ఏటా 4-7 శాతంగా ఉన్నప్పటికీ, వైద్య రంగంలో ద్రవ్యోల్బణం మాత్రం 10-15 శాతంగా లెక్కగట్టాలి. ఉదాహరణకు, ఈ రోజుల్లో ఒక కుటుంబానికి నెలకు రూ.40,000 ఖర్చవుతుంటే.. 6 శాతం ద్రవ్యోల్బణం చొప్పున లెక్కిస్తే మరో 25 సంవత్సరాల తర్వాత ఆ ఖర్చు నెలకు ఏకంగా రూ.1.7 లక్షలకు చేరుకుంటుంది. అందుకే సాధారణ ఖర్చులను, హాస్పిటల్ ఖర్చులను ఒకేలా అంచనా వేయకూడదు. దీనితో పాటు ఊహించని అత్యవసర పరిస్థితుల కోసం 6 నుండి 12 నెలలకు సరిపడా అత్యవసర నిధిని (ఎమర్జెన్సీ ఫండ్) విడిగా ఉంచుకోవాలి.
ఈక్విటీల్లో పెట్టుబడులు ..
రిటైర్మెంట్ కోసం కేవలం ఈపీఎఫ్, పీపీఎఫ్ వంటి స్థిర ఆదాయ సాధనాలపైనే పూర్తిగా ఆధారపడకూడదు. ఇవి 7-8 శాతం రాబడిని ఇస్తే, ద్రవ్యోల్బణం అందులో 5-6 శాతాన్ని హరిస్తుంది. కాబట్టి సంపద పెరగాలంటే పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉండటం అవసరం. ఉదాహరణకు, నెలకు రూ.50,000 చొప్పున ఎస్ఐపీ (SIP) ద్వారా పెట్టుబడి పెడితే.. 12 శాతం రాబడి అంచనాతో 25 ఏళ్లలో అది రూ.9.4 కోట్లు అవుతుంది. అదే పెట్టుబడి మొత్తాన్ని ఏటా 10 శాతం చొప్పున పెంచుకుంటూ (Step-up SIP) వెళ్తే, ఆ నిధి ఏకంగా రూ.21 కోట్లకు చేరుకుంటుంది.
వైవిధ్యభరితమైన పథకాలు..
వయసు పెరుగుతున్న కొద్దీ పెట్టుబడుల కేటాయింపుల్లో మార్పులు చేసుకోవాలి. 20-30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రిస్క్ తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈక్విటీల్లో 75-85 శాతం వరకు ఉంచవచ్చు. ఆ తర్వాత వయసును బట్టి క్రమంగా తగ్గిస్తూ.. 60 ఏళ్లు వచ్చేసరికి ఈక్విటీ కేటాయింపులను 20-30 శాతానికి పరిమితం చేయాలి. ప్రతి 6-12 నెలలకు ఒకసారి పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుంటూ ఉండాలి. అలాగే, పెట్టుబడులపై వచ్చే రాబడి కంటే పన్నులు చెల్లించాక చేతికి ఎంత వస్తుందనేది ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పెట్టుబడులను అమ్మినప్పుడు మూలధన రాబడిపై (Capital Gains) పన్నులతో పాటు వడ్డీ ఆదాయంపై కూడా పన్నులు ఉంటాయి కాబట్టి, వాటిని పరిగణనలోకి తీసుకుని ప్లాన్ చేసుకోవాలి.
ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయం..
ఉద్యోగ విరమణ తర్వాత నెలవారీ జీతం ఆగిపోతుంది కాబట్టి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రెగ్యులర్ ఆదాయం వచ్చేలా చూసుకోవడం చాలా ముఖ్యం. పెన్షన్, ఇంటి అద్దెలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ లేదా సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) వంటి మార్గాల ద్వారా క్రమం తప్పకుండా డబ్బు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. చాలామంది తాము సంపాదించిన అసలు మొత్తాన్ని ముట్టుకోకుండా కేవలం వడ్డీ లేదా డివిడెండ్లతోనే బతకాలని చూస్తారు, కానీ అవసరమైతే ఆ డబ్బును వాడుకోవడానికి వెనకాడకూడదు. మొత్తంగా రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం ఒక అంకె వెంట పరిగెత్తడం కాదు.. ద్రవ్యోల్బణం, పన్నులు, వైద్య ఖర్చులను అంచనా వేస్తూ వాస్తవ పరిస్థితులకు తగ్గట్లుగా ఆర్థిక స్వేచ్ఛను కాపాడుకోవడమే.







