ఒకే టైమ్.. భారీ రద్దీ.. బస్ స్టాపుల్లో ప్రయాణికుల పడిగాపులు
Hyderabad: నగరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తలకు మించిన భారంగా మారుతోంది. విద్యాసంస్థలు ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ప్రారంభమై, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ముగుస్తుండటం, అదే సమయంలో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగుల రాకపోకలు కూడా తోడవడంతో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ రద్దీ సమస్యకు విద్యాసంస్థలు, ఆఫీసుల వేళలను మార్చడమే ఏకైక పరిష్కారంగా కనిపిస్తోంది. అయితే, కాలేజీల సమయాలను మార్చాలని గతంలో గ్రేటర్ ఆర్టీసీ 100 ఇంజినీరింగ్ కళాశాలలకు లేఖలు రాసినప్పటికీ యాజమాన్యాల నుంచి ఆశించిన స్పందన రాలేదు. రాబోయే విద్యా సంవత్సరం నాటికైనా ఈ సమన్వయం కుదిరితే ప్రయాణికుల తిప్పలు తప్పుతాయి.
మొదటి స్టాప్ నుంచే ఫుల్ బోర్డు ప్రయాణాలు..
నగర శివార్లయిన మొయినాబాద్, ఘటకేసర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, శంకర్ పల్లి, చేవెళ్ల, పటాన్చెరు వంటి రూట్లలో విద్యాసంస్థలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్, మెహదీపట్నం, సీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, హయాత్‌నగర్ వైపు నడిచే బస్సుల్లో ఉదయం 7 గంటలకే మొదటి స్టేజీ నుంచే ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. వరుసగా బస్సులు పంపినా రద్దీ తగ్గకపోవడంతో, వెనుక వచ్చే ప్రయాణికుల కోసం బస్సులను సర్దుబాటు చేయడం ఆర్టీసీకి పెద్ద సవాల్‌గా మారింది.
ప్రయాణికులకు ఇబ్బందులు..
సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కుతుండటంతో బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. ఫుట్‌బోర్డు ప్రయాణాల వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం పెరగడమే కాకుండా ప్రయాణాల్లో తీవ్ర ఆలస్యం చోటుచేసుకుంటోంది. పీక్ అవర్స్‌లో బస్సుల సర్దుబాటు లేకపోవడంతో బస్టాపుల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. సబర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండగా.. ప్రధానంగా మహాలక్ష్మి పథకం ప్రయాణికులు (మహిళలు) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పరిష్కారాలు ..
ఈ తీవ్ర రద్దీని అదుపు చేయడానికి నిపుణులు కొన్ని ప్రతిపాదనలను సూచిస్తున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్కూల్, కాలేజీ సమయాల్లో అంటే ఉదయం 7.30 నుంచి 10 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు ప్రత్యేక బస్సులను నడపాలి. పాఠశాలలు, కళాశాలలు అన్నీ ఒకే సమయానికి కాకుండా 7.30 గంటలకు కొన్ని, 8.15 గంటలకు కొన్ని, 9 గంటలకు మరికొన్ని చొప్పున వేర్వేరు సమయాల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటే రద్దీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.







