వృద్ధాప్యంలో మతిమరుపుకు అసలు కారణం ఏంటి? నిపుణుల పరిశోధనలో సంచలన నిజాలు
Brain : కొంతమంది వయసు పైబడిన తర్వాత కూడా మానసికంగా చాలా చురుగ్గా ఎందుకు ఉంటారు, మరికొందరు ఎందుకు జ్ఞాపకశక్తి సమస్యలను ఎదుర్కొంటారు అనేదానిపై ఇటీవల రెండు ముఖ్యమైన అధ్యయనాలు జరిగాయి. మెదడు ఆరోగ్యం అనేది కేవలం ఒకే ఒక కారణంపై కాకుండా, మనిషి జీవితాంతం అలవాటు చేసుకునే జీవనశైలి, పర్యావరణ ప్రభావాల కలయికపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిశోధనల కోసం నిపుణులు ‘ఎక్స్పోసోమ్’ అనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. ఎక్స్పోసోమ్ అంటే ఒక మనిషి జీవితకాలంలో ఉండే ఆహారపు అలవాట్లు, వ్యాయామం, అనారోగ్యాలు, గాలి నాణ్యత , చుట్టూ ఉండే సామాజిక పరిస్థితుల మొత్తం.
జీవనశైలి ప్రభావం..
మొదటి అధ్యయనంలో భాగంగా నిపుణులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో లక్షలాది మంది ఆరోగ్య డేటాను విశ్లేషించారు. ఇందులో ధూమపానం, మద్యపానం, ఆహారపు అలవాట్లతో పాటు గుండె, జీవక్రియల ఆరోగ్యం మెదడు వృద్ధాప్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించారు. ఈ అధ్యయనంలో తేలింది ఏమిటంటే.. ఏదైనా ఒక చెడు అలవాటు లేదా ఆరోగ్య సమస్య ఎంతకాలం పాటు కొనసాగుతుందనే దానిపైనే మెదడు ఆరోగ్యం దెబ్బతినడం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, దీర్ఘకాలంగా ఉండే అధిక రక్తపోటు లేదా ధూమపానం వల్ల మెదడు నిర్మాణం బలహీనపడుతుంది. అందుకే సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెదడును కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చుట్టూ ఉండే పరిస్థితులు..
రెండవ అధ్యయనంలో నిపుణులు ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల ప్రజల వివరాలను సేకరించి పరిశోధించారు. దీని ప్రకారం.. మనం నివసించే పరిసరాలు కూడా మెదడు వృద్ధాప్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తేలింది. వాయు కాలుష్యం, వాతావరణ మార్పులు, పేదరికం, సమాజంలో ఉండే అసమానతలు , వైద్య సదుపాయాలు అందే తీరును బట్టి మెదడు ఎంత వేగంగా బలహీనపడుతుందో నిపుణులు కనుగొన్నారు.. కొన్నిసార్లు వ్యక్తిగత అనారోగ్యాలు లేకపోయినా, ఈ బాహ్య కారకాలే మెదడుపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు గుర్తించారు.
మతిమరుపు (డిమెన్షియా) నివారణ..
ఈ పరిశోధనల ప్రకారం, మెదడు ఆరోగ్యం అనేది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినది కాదు. మంచి జీవనశైలితో పాటు స్వచ్ఛమైన గాలి, సమాజంలో స్థిరత్వం, అందరికీ వైద్యం అందేలా చూడటం వంటి సామాజిక మార్పులు కూడా ఎంతో ముఖ్యం. ఇలాంటి అధ్యయనాల ద్వారా భవిష్యత్తులో మతిమరుపు (డిమెన్షియా) లాంటి వ్యాధులను ముందే గుర్తించి, ఒక్కొక్కరి శరీరతత్వానికి తగినట్లుగా ముందస్తు నివారణ చర్యలు చేపట్టడానికి వీలవుతుందని నిపుణులు భావిస్తున్నారు.







