ప్రమోషన్స్ కోసం సర్జరీ వాయిదా!
రామ్ చరణ్(Ram charan) హీరోగా బుచ్చిబాబు సానా(Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది(Peddi) సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న వేళ, ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో తన కెరీర్లోనే అత్యంత సవాళ్లతో కూడిన పాత్రను పోషించిన రామ్ చరణ్, షూటింగ్ సమయంలో ఎన్నో శారీరక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు సమాచారం. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ షూటింగ్ లో పలుమార్లు గాయపడినా, షూటింగ్‌కు అంతరాయం కలగకుండా తన పనిని కొనసాగించినట్లు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. చరణ్ డెడికేషన్ చూసి యూనిట్ మొత్తం ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది.
ఇటీవల పెద్ది ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ చేతికి రిస్ట్ బ్యాండ్‌తో కనిపించడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన చరణ్, షూటింగ్ చివరి దశలో ఓ యాక్షన్ స్టంట్ చేస్తున్న సమయంలో తన చేతికి గాయం అయినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షల్లో చేతిలో టియర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వైద్యులు సర్జరీ సూచించినట్లు సమాచారం. అయితే సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్లకు పూర్తి స్థాయిలో హాజరుకావాలనే ఉద్దేశంతో ఆయన ఆపరేషన్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
జూన్ 4న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, విడుదల తర్వాత రామ్ చరణ్ సర్జరీ చేయించుకుని కొంతకాలం విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మాత్రం ఆయన దృష్టి మొత్తం సినిమా ప్రచార కార్యక్రమాలపైనే ఉంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటించగా, సంగీతాన్ని ఏఆర్ రెహమాన్(A. R. Rahman) అందించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.







