టాలీవుడ్ లోకి శింబు కంబ్యాక్
తమిళ స్టార్ హీరోలు తెలుగు మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం ఇటీవలి కాలంలో మరింత పెరిగింది. ఇప్పటికే సూర్య(Suriya), కార్తి(Karthi), ధనుష్(Dhanush), విశాల్(Vishal) లాంటి ప్రముఖ నటులు తెలుగు దర్శకులు, నిర్మాతలతో సినిమాలు చేస్తూ రెండు భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు శింబు(Simbu) కూడా మళ్లీ చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న శింబు, వరుస పరాజయాల కారణంగా ఇక్కడి మార్కెట్‌కు కొంతకాలం దూరమయ్యాడు. అయితే ఇటీవల ఆయన కెరీర్ మళ్లీ గాడిలో పడటంతో తెలుగు ప్రేక్షకులను టార్గెట్ గా చేసుకుని కొత్త ప్లాన్స్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరోగా తెరకెక్కిన డ్యూడ్(Dude) మూవీతో డైరెక్టర్ గా ఆకట్టుకున్న కీర్తీశ్వరన్(Keertheeswaran), తన తదుపరి ప్రాజెక్ట్ కోసం శింబు(Simbu)తో చేతులు కలపనున్నట్లు సమాచారం. ఈ కథను విన్న శింబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొదట ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజా పరిణామాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు మరో టాలీవుడ్ అగ్ర సంస్థ చేతికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విశ్వసనీయ సినీ వర్గాల సమాచారం మేరకు సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతున్నారని టాక్. ఇదే సమయంలో శింబు ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్‌కు కూడా ఒక సినిమా చేయాల్సిన కమిట్మెంట్ ఉన్నట్లు సమాచారం. అలాగే తమిళ అగ్ర నిర్మాణ సంస్థ AGS ఎంటర్టైన్మెంట్ కూడా శింబుతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం కీర్తీశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమా ద్వారా శింబు మరోసారి తెలుగు మార్కెట్లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది.







