జూన్ నెల హాలిడేస్ లిస్ట్ ఇదే.. ఈ వీక్‌లో వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్
జూన్ నెల వచ్చేస్తోంది. ఈ నెలలో బ్యాంకింగ్ పనులు లేదా బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనులు ఉన్నవాళ్లు ముందే అలర్ట్ అవ్వడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ ప్రకారం.. జూన్ 2026లో దేశవ్యాప్తంగా వీకెండ్స్, పండుగలతో కలిపి మొత్తం 7 రోజులు బ్యాంకులు పనిచేయవు. చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఆ సెలవుల తేదీలు ఏంటో ఇప్పుడే చూసుకోండి.
లాంగ్ వీకెండ్..
ఈ నెలలో వచ్చే మొహర్రం పండుగ సెలవు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేర్వేరు రోజుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 25 (గురువారం) మొహర్రం సందర్భంగా బ్యాంకులు మూసి ఉండే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో జూన్ 26 (శుక్రవారం) మొహర్రం సెలవు ఇచ్చారు. తెలంగాణలో శుక్రవారం సెలవు కావడంతో.. ఆ వెంటనే నాలుగో శనివారం (జూన్ 27), ఆదివారం (జూన్ 28) రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. దీంతో ఉద్యోగులకు, కస్టమర్లకు లాంగ్ వీకెండ్ దొరకనుంది.
ఇతర ప్రాంతీయ సెలవుల వివరాలు..
తెలుగు రాష్ట్రాలతో పాటు న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో కూడా జూన్ 26న మొహర్రం సెలవు ఉంటుంది. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉండే స్థానిక పండుగల విషయానికి వస్తే.. జూన్ 15 (సోమవారం) వైఎంఏ డే, రాజా సంక్రాంతి కారణంగా ఐజ్వాల్, భువనేశ్వర్లలో బ్యాంకులు పనిచేయవు. జూన్ 29 (సోమవారం) సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా షిమ్లాలో సెలవు ఉంటుంది. అలాగే జూన్ 30 (మంగళవారం) రెమ్నా నీ హాలిడే కారణంగా ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.
రెగ్యులర్ వీకెండ్ సెలవులు..
ఈ నెలలో సాధారణ సెలవుల విషయానికి వస్తే.. జూన్ 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. వీటితో పాటు జూన్ 13న రెండో శనివారం, జూన్ 27న నాలుగో శనివారం సెలవులు యథాతథంగా ఉంటాయి.
డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథాతథం..
బ్యాంక్ బ్రాంచ్‌లు మూసి ఉన్నప్పటికీ ఆన్లైన్ సేవలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్, ఏటీఎంలు, యూపీఐ (UPI) లావాదేవీలు ఎప్పటిలాగే 24 గంటలూ పనిచేస్తాయి. కాబట్టి నగదు విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్ వంటి అత్యవసర పనులు ఉన్నవారు ఈ హాలిడే లిస్ట్‌ను బట్టి తమ పనులను ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.







