చూయింగ్ గమ్‌తో ఫేస్ స్లిమ్ అవుతుందా.. సోషల్ మీడియా ప్రచారంలో అసలు నిజమెంత?
Chewing Gum: ప్రస్తుత రోజుల్లో పర్ఫెక్ట్ ఫేస్ కట్ కోసం గంటల తరబడి చూయింగ్ గమ్ నమలడం ఒక మంచి ఫేస్ ఎక్సర్సైజ్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారంలో అస్సలు నిజం లేదని, నిరంతరం చూయింగ్ గమ్ నమలడం వల్ల ముఖం అందంగా మారాల్సింది పోయి.. లేనిపోని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లు అవుతుందని సైన్స్, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శాస్త్రవేత్తలు చెబుతున్న నిజాలు ..
చూయింగ్ గమ్ నమలడం వల్ల దవడ కండరాలు (మాసెటర్) కదలడం నిజమే అయినప్పటికీ, అది ముఖంలో పేరుకుపోయిన ఫ్యాట్‌ను అస్సలు కరిగించలేదు. ఒక వ్యక్తికి పదునైన దవడ రేఖ ఏర్పడటం అనేది వారి శరీరంలో ఉన్న కొవ్వు శాతం, వారి జన్యువులు (Genetics) , చర్మ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది ముఖాన్ని స్లిమ్‌గా మార్చుకోవడానికి చూయింగ్ గమ్ నములుతుంటారు. కానీ, అతిగా నమలడం వల్ల దవడ కండరాలు విపరీతంగా గట్టిపడి, వాపునకు గురవుతాయి. దీనివల్ల ముఖం సన్నగా మారడానికి బదులు మరింత వెడల్పుగా, బరువుగా మారి సహజ ఆకృతి దెబ్బతింటుంది. నిరంతరం నమలడం వల్ల దవడను అంటిపెట్టుకుని ఉండే ‘టెంపోరోమాండిబ్యులర్ జాయింట్’ పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల దవడల నుండి క్లిక్ క్లిక్ అనే శబ్దాలు రావడం, నోరు తెరవడం కష్టమవ్వడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే దవడ నరాలు ఒత్తిడికి గురై తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్‌కు దారితీస్తుంది.
పొట్ట ఉబ్బరంగా..
మనం నోట్లో వేసుకుని నమలడం ప్రారంభించగానే.. ఆహారం వస్తోందని భావించి జీర్ణక్రియ కోసం కడుపులో గ్యాస్ట్రిక్ ఆమ్లాలు (యాసిడ్స్) విడుదలవుతాయి. ఖాళీ కడుపుతో నమలడం వల్ల ఆ యాసిడ్స్ పొట్ట లైనింగ్‌ను దెబ్బతీసి తీవ్రమైన ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంటకు కారణమవుతాయి. నమిలేటప్పుడు ఎక్కువ గాలిని మింగడం వల్ల పొట్ట ఉబ్బరంగా తయారవుతుంది.
చిగుళ్లు, ప్రేగుల సమస్యలు..
షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్‌లో వాడే సార్బిటాల్, ఆస్పార్టేమ్ వంటి కృత్రిమ తీపి పదార్థాలు (Artificial Sweeteners) దంతాల ఎనామెల్‌ను బలహీనపరుస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థలో పూర్తిగా అరగవు కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు (మోషన్స్), తీవ్రమైన కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
సరైన మార్గం ఏంటి?
ముఖం స్లిమ్‌గా మారడానికి చూయింగ్ గమ్స్ నమలడం సరైన పద్ధతి కాదు. దానికి బదులుగా సమతుల్య ఆహారం తీసుకోవడం, డైట్లో ఉప్పు, చక్కెర శాతాన్ని తగ్గించడం, ప్రతిరోజూ తగినంత నీరు తాగి శరీరంలోని మొత్తం కొవ్వును తగ్గించుకోవాలి. నిపుణులు సూచించే సురక్షితమైన ఫేస్ ఎక్సర్సైజుల ద్వారా మాత్రమే అందమైన ఆకృతిని సహజంగా సొంతం చేసుకోగలరు.







