లాస్ట్ మినిట్ టెన్షన్ లేకుండా పెద్ది.. రిలీజ్‌కు ముందే క్లీన్ క్లియర్!
టాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ అంటే చివరి నిమిషం వరకు ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఓవర్సీస్ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ వంటి వర్క్స్ తో మేకర్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడం సాధారణమే. ముఖ్యంగా విదేశీ విడుదలలకు సంబంధించిన కంటెంట్ ఆలస్యమైతే డిస్ట్రిబ్యూటర్లు, డిజిటల్ ప్రొవైడర్లపై కూడా ప్రభావం పడుతుంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్న భారీ సినిమా పెద్ది(Peddi) మాత్రం ఈ విషయంలో పూర్తిగా భిన్నమైన మార్గంలో నడుస్తోంది. రిలీజ్‌కు ముందే కీలక పనులన్నీ పూర్తి కావడంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకున్నట్లు సమాచారం.
డైరెక్టర్ బుచ్చిబాబు సానా(buchibabu sana) తన టీమ్‌తో కలిసి సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పెద్ది ఫైనల్ ఎడిట్ పూర్తవగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా లాక్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ వెర్షన్ కంటెంట్‌ను సమయానికి పంపించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని సమాచారం. దీంతో సాధారణంగా కనిపించే ఆఖరి నిమిషం గందరగోళం, టెక్నికల్ ఆటంకాలు ఈ సినిమాకు దూరంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
జూన్ 4న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న పెద్దిపై ఇప్పటికే అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor) జంటగా నటిస్తున్న ఈ సినిమాకు బిజినెస్ వర్గాల్లో కూడా మంచి క్రేజ్ కనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న థియేటర్ల పర్సెంటేజ్ వ్యవస్థ వివాదం కూడా ఈ వారాంతానికి పరిష్కారమయ్యే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకూలంగా సాగితే పెద్ది రికార్డ్ స్థాయి రిలీజ్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.







