భారత భూభాగాలను మన సైన్యం ఆక్రమించింది.. నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..!
నేపాల్ ప్రధాని బాలేంద్ర షా.. చిక్కుల్లో పడ్డారు. భారత భూభాగాలను తమ సైన్యం ఆక్రమించినట్లు తెలిసిందంటూ స్వయంగా ప్రధాని పదవిలో ఉన్న బాలేంద్రషా వ్యాఖ్యానించడం కలకలం రేపింది. నేపాల్ ప్రతిపక్ష పార్టీలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో నేపాల్ విదేశాంగశాఖ రంగంలోకి దిగి బాలేంద్ర వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ప్రధాని పదవి చేపట్టిన తరువాత బాలేంద్ర ఆదివారం తొలిసారిగా పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్-నేపాల్ సరిహద్దు వివాదం సహా పలు అంశాలపై ఆయనకు విపక్షాల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీలపై నెలకొన్న వివాదం గురించి ఆయన స్పందిస్తూ.. నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాదని, భారత భూభాగాలనూ నేపాల్ ఆక్రమించిందన్నారు. ప్రధాని అయ్యాకే తనకీ విషయం తెలిసిందన్నారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి దౌత్య చర్చలతో పాటు చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని నేపాల్, భారత్ అంగీకారానికి వచ్చాయన్నారు. ఈ అంశాన్ని తాము చైనా, బ్రిటన్ల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బాలేంద్ర వ్యాఖ్యలు నేపాల్ సార్వభౌమత్వంపై రాజీపడే ధోరణిలో ఉన్నాయంటూ ధ్వజమెత్తాయి. దీంతో నేపాల్ విదేశాంగశాఖ స్పందించింది. సరిహద్దును దాటి ఇరువైపులా ఏర్పడిన నివాస ప్రాంతాలు, కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో ఆక్రమణ గురించే ప్రధాని వ్యాఖ్యానించారు తప్ప.. ప్రాదేశిక హక్కులతో ఆయన వ్యాఖ్యలకు సంబంధం లేదని ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి








