తెలంగాణలో రైతు డిస్కమ్ చిచ్చు!
తెలంగాణలో కొత్తగా ఏర్పాటవుతున్న ‘రైతు డిస్కమ్‘ (TGRPDCL) ఇప్పుడు విద్యుత్ సంస్కరణల అంశంగా కంటే, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య అత్యంత ప్రతిష్టాత్మక రాజకీయ యుద్ధ క్షేత్రంగా మారింది. జూన్ 2న నాటికి ఈ మూడో డిస్కమ్‌ను ఎలాగైనా పట్టాలెక్కించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉండగా.. ఇది రైతులకు ఉచిత విద్యుత్‌ను ఎగ్గొట్టేందుకేనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెద్ద ఎత్తున పొలిటికల్ అటాక్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇరు నేతల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం, సవాళ్లు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ ఈ వ్యవహారాన్ని పూర్తిగా రైతు సెంటిమెంట్‌తో ముడిపెట్టి కాంగ్రెస్ సర్కార్‌ను కార్నర్ చేస్తోంది. కేటీఆర్ ప్రధానంగా మూడు అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు. వ్యవసాయ కనెక్షన్లను, ప్రభుత్వ నీటి ప్రాజెక్టులను విడిగా ఒకే డిస్కమ్ కిందకు చేర్చడం వెనుక అసలు వ్యూహం రైతు బోర్లకు మీటర్లు బిగించడమేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పరిశ్రమలు, వాణిజ్య రంగాల ద్వారా వచ్చే క్రాస్ సబ్సిడీ ఆదాయం లేకుండా.. కేవలం 5 కోట్ల మూలధనంతో పుడుతున్న సంస్థపై ఏకంగా 71,964 కోట్ల అప్పుల భారం వేయడం అంటే ఆ సంస్థను కావాలనే దివాలా తీయించడమేనని విమర్శిస్తున్నారు. సంస్థ నష్టాల్లో కూరుకుపోయాక, సబ్సిడీలు ఇవ్వలేమనే సాకుతో భవిష్యత్తులో 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని పూర్తిగా ఎత్తేసేందుకే కాంగ్రెస్ ఈ ప్లాన్ చేసిందని కేటీఆర్ గట్టిగా వాదిస్తున్నారు.
బీఆర్ఎస్ ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతే దూకుడుగా తిప్పికొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందంటూ కేటీఆర్‌కు నేరుగా ఒక బహిరంగ సవాల్ విసిరారు. రైతు డిస్కమ్ వస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రైతు బోర్లకు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మీటర్లు పెడితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఒకవేళ మీటర్లు పెట్టకపోతే కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ఇప్పుడు పొలిటికల్ హీట్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది.
వ్యవసాయ సబ్సిడీల భారాన్ని వేరు చేయడం ద్వారా పాత డిస్కమ్‌ల క్రెడిట్ రేటింగ్ మెరుగవుతుందని, రైతు డిస్కమ్ ద్వారా గ్రామీణ విద్యుత్ సరఫరా, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చని రేవంత్ సర్కార్ సమర్థించుకుంటోంది.
రాజకీయ నాయకుల సవాళ్లు ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం 29.05 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్న రైతాంగంలో ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది. 72 వేల కోట్ల భారీ అప్పులు ఉన్న సంస్థను కేవలం 2,000 మంది సిబ్బందితో ఎలా నడుపుతారనే విద్యుత్ ఉద్యోగ సంఘాల హెచ్చరికలు కూడా ప్రతిపక్షానికి అస్త్రాలుగా మారాయి.
చివరకు, ఈ రైతు డిస్కమ్ రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు దేశానికే ఆదర్శంగా నిలిచే సాహసోపేత సంస్కరణ అవుతుందా? లేక కేటీఆర్ హెచ్చరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి పీడకలగా మారుతుందా? అనేది జూన్ 2 తర్వాత ప్రారంభమయ్యే అసలు సిసలు పొలిటికల్ గేమ్ తేల్చనుంది.
ఇవి కూడా చదవండి








