టాలీవుడ్ నిర్మాణ సంస్థతో టైగర్ ష్రాఫ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)కి ఈ ఏడాది ప్రారంభంలో భారీ అంచనాలతో రిలీజైన ప్రభాస్(Prabhas) రాజా సాబ్(Raja Saab) ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫలితం సంస్థపై ఆర్థికంగా ప్రభావం చూపడంతో ప్రొడక్షన్ హౌస్ ప్రస్తుతం తన వ్యూహాన్ని మార్చుకుని ముందుకు సాగుతోంది. భారీ బడ్జెట్ ప్రాజెక్టుల కంటే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి సారిస్తున్న సంస్థ, 2027 కోసం ఆసక్తికరమైన ప్రాజెక్టులను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం తేజ సజ్జ(Teja Sajja) హీరోగా తెరకెక్కుతున్న మిరాయ్2(Miraa2) షూటింగ్ దశలో ఉండగా, వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదే సమయంలో తేజ సజ్జతో జాంబీ రెడ్డి2(Jombie Reddy2)ను కూడా ప్రారంభించే ఆలోచనలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తొలి భాగం సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని సీక్వెల్‌ను మరింత భారీ స్థాయిలో రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. యువ ప్రేక్షకులను ఆకట్టుకునే ఫాంటసీ, యాక్షన్, హారర్ జానర్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంస్థ, ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff)తో ఓ ప్రతిష్ఠాత్మక సినిమా కోసం చర్చలు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంస్థ రూపొందించిన కథాంశానికి టైగర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం డైరెక్టర్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవల సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న టైగర్ ష్రాఫ్‌కు ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.







