సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్
▪️ కృష్ణ సినిమాలను గుర్తు చేస్తూ సాగే ప్రత్యేక పాట
▪️ 52 మంది ఆర్టిస్టులతో 45 రోజుల్లో సినిమా పూర్తి
▪️ క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరెక్కించిన మూవీ
▪️ జూన్ 12న థియేటర్లో విడుదల కానున్న చిత్రం
టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పైకి హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌తో పాటు రెండు ప్రత్యేక గీతాలను విడుదల చేశారు. అలాగే సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు చిత్రాల టైటిళ్లను గుర్తు చేస్తూ రూపొందించిన ఈ సినిమాలోని ప్రత్యేక గీతాన్ని కృష్ణ అభిమానుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటలో కృష్ణ వీరాభిమాని, నటుడు కృష్ణసాయి నటించడం విశేషం. కృష్ణసాయి, ప్రీతి సుందర్ ఈ గీతంలో కనిపించగా, రచన-సంగీతాన్ని దర్శకుడు సంజీవ్ మేగోటి అందించారు. అలాగే కృతి వర్మ స్పెషల్ అప్పియరెన్స్‌లో నటించిన “నువ్వట్టా సూత్తా ఉంటే” అనే మరో గీతాన్ని తెలంగాణ డీఐజీ రమణారెడ్డి విడుదల చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ డీఐజీ రమణారెడ్డి, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, సీనియర్ నిర్మాత ఆర్. సీతారామరాజు, సూపర్ స్టార్ కృష్ణ మేకప్‌మెన్ మాధవరావు, నిర్మాత ఘంటా శ్రీనివాసరావు, డిస్ట్రిబ్యూటర్ నరేంద్ర, పీఆర్ఓ శర్మ, డిస్ట్రిబ్యూటర్ సిరాజ్, ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన
జాతీయ అధ్యక్షులు ఖాదర్ గోరి, నటులు కృష్ణసాయి, కృతి వర్మ, ప్రీతి సుందర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, “సూపర్ స్టార్ కృష్ణ సినిమాల టైటిళ్లతో రూపొందించిన పాట అద్భుతంగా ఉంది. కృష్ణగారు గొప్ప వ్యక్తి. ఆయన బర్త్ డే సందర్భంగా ఈ వేడుక నిర్వింహించిన చిత్రయూనిట్‌కు అభినందనలు. తక్కువ బడ్జెట్లో అధిక నాణ్యతతో సినిమాలు రూపొందించే దర్శకుడు సంజీవ్ మేగోటి. ఈ చిత్రంలో ఆయన తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
డీఐజీ రమణారెడ్డి మాట్లాడుతూ, “ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. మంచి కాన్సెఫ్టుతో సినిమా రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను” అన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మేకప్‌మెన్ మాధవరావు మాట్లాడుతూ, “కృష్ణగారు నాతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. ఆయనపై ప్రత్యేక గీతాన్ని రూపొందించడం అభినందనీయం. కృష్ణగారి వీరాభిమాని కృష్ణసాయి ఈ పాటలో అద్భుతంగా నటించి ఆయనను గుర్తు చేశారు” అన్నారు.

హీరో కృష్ణసాయి మాట్లాడుతూ, “ఈ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నా అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణగారి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలను గుర్తు చేసే పాటలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలి. అందరిని మెప్పించే సినిమా ఇది” అన్నారు.
దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, “52 మంది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. ఇది హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణగారితో సినిమా చేసే అవకాశం నాకు వచ్చింది. నేను చేసిన సినిమాలో నాలుగు పేజీల డైలాగ్‌ను ఒకే టేక్‌లో చెప్పిన గొప్ప నటుడు ఆయన. ఆయన పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది” అని తెలిపారు.
నటి కృతి వర్మ మాట్లాడుతూ, “నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరూ సినిమా చూడాలి” అని అన్నారు.
నటి ప్రీతి సుందర్ మాట్లాడుతూ, “తొమ్మిదేళ్లుగా నటిగా పలు ప్రాజెక్టుల్లో పనిచేశాను. ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో అవకాశం ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు. సూపర్ స్టార్ కృష్ణగారిపై రూపొందించిన పాటలో భాగమవడం చాలా సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.
హారర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రత్యేక గీతాలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.







