జన నాయగన్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
తమిళ స్టార్ విజయ్(Vijay) నటించిన చివరి ఫీచర్ ఫిల్మ్‌గా ప్రచారం పొందిన జన నాయగన్(Jana Nayagan) రిలీజ్ విషయంలో నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితి ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. మొదట ఈ సినిమాను సంక్రాంతి 2026 సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసినప్పటికీ, అనేక కారణాలతో సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఐదు నెలలు గడిచినా రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడంతో అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కొత్త రిలీజ్ డేట్లపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నా, చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ హెచ్ వినోద్(H Vinod) చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నిజం చెప్పే ధైర్యం నాకు లేదు. ధైర్యం ఉన్నా, దాన్ని మీరు పంచుకునే ధైర్యం ఉండదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ఈ మాటల వెనుక అసలు అర్థం ఏంటి? సినిమా ఆలస్యానికి మరేదైనా పెద్ద కారణం ఉందా? అనే ప్రశ్నలు అభిమానులను వెంటాడుతున్నాయి. కొందరు ఇది సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని భావిస్తుండగా, మరికొందరు సినిమా రిలీజ్ వెనుక పెద్ద స్థాయి అడ్డంకులు ఉన్నాయేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, సెన్సార్ బోర్డు అధికారులు ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపినట్లు సమాచారం. కమిటీ స్క్రీనింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ జారీ కాలేదని తెలుస్తోంది. దీంతో రిలీజ్ డేట్‌పై స్పష్టత రాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సామాజిక అంశాలతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కలిగిన ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) నిర్మిస్తోంది. విజయ్ ఫ్యాన్స్ మాత్రం అన్ని అడ్డంకులు తొలగి జన నాయగన్ జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.







