ఆటా పికల్బాల్ టోర్నమెంట్….రికార్డు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) మహాసభలను పురస్కరించుకుని మేరీలాండ్ లో నిర్వహించిన పికల్బాల్ టోర్నమెంట్ విజయవంతమైంది. రికార్డుస్థాయిలో ఇందులో టీమ్‌లు పాల్గొనడం విశేషం. మేరీల్యాండ్‌లోని ఫ్రెడరిక్లో మే 30, శనివారం నాడు ఈ టోర్నమెంట్ జరిగింది.ఈ ప్రాంతంలోని పికల్బాల్ క్రీడాభిమానులందరినీ ఒకే చోటికి చేర్చిన ఈ ఈవెంట్, రోజంతా ఉత్సాహం, స్నేహభావం మరియు హోరాహోరీ పోటీలతో సాగింది. బిగినర్, ఇంటర్మీడియట్ మరియు అడ్వాన్స్డ్ విభాగాల్లో కలిపి సుమారు 55 టీముల నుండి 110 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు, క్రీడాకారుల అసాధారణమైన క్రీడాస్ఫూర్తి, ఉత్సాహభరితమైన వాతావరణం చూసినప్పుడు కమ్యూనిటీలో ఈ ఆటపై పెరుగుతున్న ఆదరణను తెలియజేసింది.
రోజంతా క్రీడాకారులు ప్రదర్శించిన ఆటతీరు, ఈ టోర్నమెంట్ లో పాల్గొనడానికి ముందుకురావడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్ కేవలం పోటీలకే పరిమితం కాకుండా, కమ్యూనిటీ మధ్య బంధాన్ని పెంచడానికి, కొత్త స్నేహాలను చిగురింపజేయడానికి, అలాగే ఆటగాళ్లు మరియు వారి కుటుంబాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఒక చక్కని వేదికగా నిలిచింది. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతులను అందజేశారు.
ఆటా 19వ మహాసభల కన్వీనర్ శ్రీధర్ బనాలాతో పాటు సుధీర్ దామిడి, వెంకట యర్రం, వాసుదేవ తల్లా మరియు కోట్ల తిప్పారెడ్డి స్థానిక బృందం సభ్యుల సహకారంతో ఈ టోర్నమెంట్ విజయవంతానికి కృషి చేశారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బనాలా మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ కేవలం క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికే కాకుండా, కమ్యూనిటీని ఒకతాటిపైకి తీసుకురావడంలో ఆటాకు ఉన్న నిబద్ధతను మరోసారి నిరూపించింది అని పేర్కొన్నారు. జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్‌లో జరగనున్న ఆటా 19వ కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ లో ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ టోర్నమెంట్ విజయవంతానికి సహకరించిన వారందరికీ ఆటా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.







