వైసీపీ మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ భూకబ్జా రచ్చ..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp) మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భూకబ్జా, ప్రభుత్వ ఉత్తర్వుల ఫోర్జరీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. శేరిలింగంపల్లి పరిధిలోని ఒక భూమి క్రమబద్ధీకరణ దరఖాస్తు కోసం ఐఏఎస్ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ జీవోలు సృష్టించిన ఉదంతంపై శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియాకు అధికారిక వివరణ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు.
నిందితులు భూమిని అక్రమంగా క్రమబద్ధీకరించుకునేందుకు ఏకంగా ఉన్నతాధికారుల సంతకాలనే ఫోర్జరీ చేసి నకిలీ ఆర్డర్లు తయారు చేశారని, ఆ పత్రాలన్నింటినీ పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారని డీసీపీ తెలిపారు. ఈ నకిలీ నెట్వర్క్ వెనుక రాధాకృష్ణ అనే వ్యక్తి నేతృత్వంలోని ఒక ముఠా పనిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠా రకరకాల నకిలీ ప్రభుత్వ సంస్థల పేర్లను సృష్టించి, వాటికి సంబంధించిన నకిలీ స్టాంపులను కూడా సొంతంగా తయారు చేసుకుందని, ప్రధాన నిందితుడైన రాధాకృష్ణపై ఇప్పటికే 9 కేసులు ఉన్నాయని డీసీపీ స్పష్టం చేశారు.
ఈ భూమికి సంబంధించి నకిలీ జీవోలు, అనుకూల ఉత్తర్వులు సృష్టించి ఇచ్చినందుకు గానూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నిందితుడు రాధాకృష్ణకు రూ.4 కోట్లు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. దీనితో పాటు ఈ వ్యవహారాన్ని లీగల్గా నడిపించిన రాధాకృష్ణ లాయర్ బృందానికి కూడా మరో రూ.4 కోట్లు ముట్టినట్లు సమాచారం ఉందని డీసీపీ పేర్కొన్నారు. మొత్తంగా ఈ ఫోర్జరీ వ్యవహారంలో దాదాపు రూ.8 కోట్ల మేర భారీ డీల్ కుదిరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ భారీ కుట్రపై రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నివాసాల నుండి 10 ఏటీఎం కార్డులు, 12 చెక్ బుక్లు, 3 లాప్టాప్లు మరియు 2 మొబైల్ ఫోన్లతో పాటు ఫోర్జరీకి వాడిన నకిలీ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్రపై లోతైన విచారణ జరుపుతున్నామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.







