అమెరికాలో ‘ద ఏలియన్స్’ వెబ్సైట్..
అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది.ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో తిష్టవేసిన వారిని.. నిర్దాక్షిణ్యంగా వెనక్కి తిప్పి పంపుతోంది. ఓ దశలో అయితే ట్రంప్.. ఏకంగా యుద్ధవిమానాలను డిపోర్టేషన్‌కు వినియోగించారు. అమెరికన్ సంపదను..అక్రమమార్గాల్లో వచ్చి వీరంతా అనుభవిస్తున్నారన్నది అమెరికా ప్రభుత్వం అభియోగం.
అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోన్న ట్రంప్ (Donald Trump) యంత్రాంగం తాజాగా మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ‘ఏలియన్స్’ పేరుతో కొత్తగా ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్రమంగా నివసిస్తున్నట్లు అనుమానం ఉన్న వ్యక్తుల వివరాలు తెలియజేయాలని పిలుపునిచ్చింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే విదేశీయులను ‘ఏలియన్స్’గా డొనాల్డ్ ట్రంప్ సంబోదిస్తున్నారు.
‘‘60ఏళ్లుగా అమెరికా ప్రభుత్వం ఓ రహస్యాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతోంది. ఏలియన్స్ మనమధ్యే నివసిస్తూ నిత్యం మనతోనే కలిసి నడుస్తున్నారు. కానీ, వాళ్లు ఇక్కడివారు కాదు. లక్షలాది మంది గుట్టుగా వచ్చి మన సమాజంలో కలిసిపోయారు. అసలేం జరుగుతోందో అనేక మంది అధ్యక్షులు, చట్టసభ సభ్యులు, ఉన్నతాధికారులకు తెలుసు. అమెరికా పౌరులను రక్షించేందుకు బదులు.. అక్రమ ప్రవేశాలను చూసి చూడనట్లు వదిలేశారు. అక్రమ వలసల వల్ల అమెరికన్లకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అధ్యక్షుడు ట్రంప్ నిర్భయంగా ఎత్తిచూపారు. అటువంటి వారి వివరాలు తెలియజేస్తే.. సురక్షితంగా స్వదేశాలకు పంపిస్తాం’’ అని కొత్త వెబ్‌పేజీలో వైట్‌హౌస్ పేర్కొంది.







