డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై ‘విండ్‌ఫాల్ ట్యాక్స్’ పెంచిన కేంద్రం
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినప్పటికీ కారణంగా అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్ స్థిరపడటానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF – విమాన ఇంధనం) ఎగుమతులపై విండ్‌ఫాల్ గెయిన్స్ పన్నును (Windfall Tax) మరోసారి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఈ కొత్త పన్నులు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి.
పన్నుల్లో మార్పులు ఇలా..
తాజా సవరణల ప్రకారం ఎగుమతులపై విధించే ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (Windfall Tax) వివరాలు కింది విధంగా ఉన్నాయి:
డీజిల్ (Diesel): ఎగుమతులపై సుంకం లీటరుకు రూ. 13.5 నుంచి రూ. 14కు పెరిగింది.
ఏటీఎఫ్ (ATF): విమాన ఇంధన ఎగుమతులపై పన్ను లీటరుకు రూ. 9.5 నుంచి రూ. 12.5కు పెంచారు.
పెట్రోల్ (Petrol): పెట్రోల్ ఎగుమతులపై విధిస్తున్న సుంకం లీటరుకు రూ. 1.5 వద్దే ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగుతుంది.
దేశీయ ధరలపై ప్రభావం ఉండదు
విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనాలపై మాత్రమే ఈ విండ్‌ఫాల్ ట్యాక్స్ (Windfall Tax) విధిస్తారు. కాబట్టి దేశీయంగా బంకుల్లో వినియోగదారులకు విక్రయించే పెట్రోల్, డీజిల్ ధరల్లో కానీ, వాటిపై ఉన్న పన్నుల్లో కానీ కేంద్రం ఎలాంటి మార్పూ చేయలేదు. సామాన్యులపై ఈ నిర్ణయం వల్ల ఎలాంటి అదనపు భారం పడదు.
పెంపు వెనుక ప్రధాన కారణాలు..
అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా ఉన్నప్పుడు, చమురు రిఫైనరీలు అధిక లాభాల కోసం విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల దేశీయ మార్కెట్లో ఇంధన కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో ఎగుమతిదారులు ఆర్జించే అకస్మాత్తు లేదా ఊహించని అధిక లాభాలను (Windfall Gains) నియంత్రించడం ఈ పన్ను (Windfall Tax) విధింపు ప్రధాన ఉద్దేశమని సంబంధిత అధికారులు అంటున్నారు.








