పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారితో మంత్రి నారా లోకేష్ సమావేశం
సీఎంకు ఏపీ సంక్షేమ పథకాల అమలు, టెక్నాలజీ వినియోగం, పెట్టుబడుల సాధనను వివరించిన మంత్రి
ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ బంధం మరింత బలోపేతం కావాలని ఆకాంక్ష
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని కోల్ కతాలో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత శాలువాతో సీఎంను లోకేష్ సత్కరించారు. ఏపీలో అమలు చేస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం గురించి లోకేష్ వివరించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి గరిష్ట ప్రయోజనంతో కూడిన సంక్షేమ పథకాలు అర్హులైన వారికి పారదర్శకంగా అందజేస్తున్న ఏపీ ప్రభుత్వ మెకానిజం సీఎంకు వివరించారు. పశ్చిమ బెంగాల్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును సీఎంను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో అమలవుతున్న డిజిటల్ గవర్నెన్స్, రియల్-టైమ్ మానిటరింగ్ ఫలితాలను సీఎంకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ – పశ్చిమ బెంగాల్ మధ్య ఉన్న సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేద్దామని కోరారు. పశ్చిమ బెంగాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి తగిన స్థలాన్ని కేటాయించాలని, తిరుమలలో పశ్చిమ బెంగాల్ భవన్ నిర్మాణానికి అన్ని విధాలా సాయం అందిస్తామని సీఎంకు విన్నవించారు. మత్స్య సంపద పెంపు, ఎగుమతుల విషయంలో పరస్పర సహకారంతో మరింత అభివృద్ది సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనలపై పశ్చిమ బెంగాల్ సీఎం సానుకూలంగా స్పందించారు.








