మ్యాప్ మార్చేశారు.. భారత్ పేరు లేపేశారు! అమెరికా ఆడిన మైండ్ గేమ్ వెనుక అసలు నిజం ఇదీ!
మిత్రుడు దూరమవుతున్నాడని ఎప్పుడూ గొడవలతో తెలియదు. ఒక్కోసారి కుర్చీ పక్కకు జరగడంతో తెలుస్తుంది. ఇప్పుడు అమెరికా చేసిన పని కూడా అలాంటిదేనేమో అనిపిస్తోంది. 2026 జూన్ 16న అమెరికా ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఢిల్లీకి ఫోన్ చేయలేదు. ఎలాంటి భారీ ప్రకటన చేయలేదు. కానీ ఒక చిన్న మార్పు చేసింది.”US Indo-Pacific Command” అనే పేరులో నుంచి “Indo” అనే ఒక్క పదాన్ని తీసేసింది. ప్రపంచం దాన్ని సాధారణ పరిపాలనా మార్పుగా చూసి ముందుకు వెళ్లిపోయింది. కానీ ఢిల్లీలోని వ్యూహాత్మక వర్గాలు మాత్రం ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఎందుకంటే… అది కేవలం ఒక పదం కాదు. ఆ పదం వెనుక భారత్ స్థానం ఉంది. ఆ పదం వెనుక అమెరికా వ్యూహం ఉంది. ఆ పదం వెనుక చైనాకు ఇచ్చిన హెచ్చరిక ఉంది.
ఒక పదం కాదు.. ఒక సంకేతం!
70 ఏళ్ల పాటు ఈ కమాండ్ పేరు “Pacific Command”గానే కొనసాగింది. అమెరికా పశ్చిమ తీర ప్రాంతం నుంచి భారత సరిహద్దుల వరకు ఉన్న భారీ సైనిక ప్రాంతాన్ని ఇది పర్యవేక్షించేది. 2018లో ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో ఒక్కసారిగా “Indo” అనే పదం జోడించారు. అది భారత్‌కు ఇచ్చిన గౌరవం మాత్రమే కాదు. ఒక స్పష్టమైన వ్యూహాత్మక ప్రకటన కూడా. ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ వేర్వేరు ప్రాంతాలు కావు, ఒకే భౌగోళిక రంగస్థలం అని అమెరికా ప్రపంచానికి చెప్పింది. అలాగే “ఈ అంతర్జాతీయ చదరంగంలో మీరు కేవలం ఒక సైడ్ క్యారెక్టర్ కాదు, ఒక ముఖ్యమైన పాత్ర” అని. దీనివల్ల భారత్‌కు ప్రపంచస్థాయి గుర్తింపుతో పాటు ఉమ్మడి సైనిక విన్యాసాలు, నిఘా సమాచార మార్పిడి వంటి ప్రయోజనాలు లభించాయి. అలాంటిది, 2026లో ఆ పదాన్ని తొలగించడం అంటే అమెరికా మళ్లీ వెనక్కి తగ్గుతోందనే సంకేతాన్ని ఇవ్వడమే.
ఆ ‘మ్యాప్’ వెనుక కుట్ర!
ఈ పేరు మార్పుతో పాటు అమెరికా అధికారికంగా విడుదల చేసిన ఒక మ్యాప్ భారత సార్వభౌమత్వాన్ని నిలువునా అవమానించేలా ఉంది. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ (POK) ప్రాంతాన్ని క్లియర్ గా పాకిస్తాన్ భూభాగంగా చూపించారు, అక్సాయ్ చిన్ను భారత్ సరిహద్దుల వెలుపల నెట్టేశారు. కొన్ని నెలల క్రితం పాకిస్తాన్ అభ్యంతరం చెప్పగానే అఖండ భారత్ మ్యాప్‌ను డిలీట్ చేసిన అమెరికా, ఇప్పుడు భారత్ అభ్యంతరాలను మాత్రం తొలగించకుండా కాలయాపన చేస్తోంది. దీన్నిబట్టి మ్యాప్‌లు అంటే కేవలం భూగోళం కాదు, అవి ఒక దేశం ఇచ్చే పొలిటికల్ సంకేతాలు!
బీజింగ్ రహస్య డీల్?
అసలు అమెరికా ఇంతలా మారడానికి కారణం చైనాతో కుదిరిన ఒక నయా ఒప్పందం. ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లి షీ జిన్‌పింగ్‌తో చేతులు కలిపారు, వందల కోట్ల డాలర్ల వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు. చైనాను హెచ్చరించడానికి పెట్టిన ‘ఇండో’ అనే పదం బీజింగ్ పాలకులకు నచ్చడం లేదు, అందుకే చైనా స్నేహం కోసం అమెరికా ఆ పదాన్నే డిలీట్ చేసింది. ప్రపంచాన్ని కేవలం రెండు సూపర్ పవర్స్ (G2) మాత్రమే శాసించాలనే అమెరికా ఆశయానికి భారత్ బలి అవుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ఉత్సాహం కోల్పోతున్న ‘క్వాడ్’ (Quad)
చైనాను ముట్టడించడానికి భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో ఏర్పడిన ‘క్వాడ్’ (Quad) కూటమి ఇప్పుడు ఐసీయూలోకి వెళ్ళిపోయినట్లు కనిపిస్తోంది. భారత్‌లో జరగాల్సిన సదస్సులు రద్దయ్యాయి, దేశాధినేతలు రావాల్సిన మీటింగ్‌లు కేవలం విదేశాంగ మంత్రుల కాఫీ మీటింగ్లుగా మారిపోయాయి. క్వాడ్ కూటమి శవపేటికలో అమెరికా ఆఖరి మేకు కొట్టేసిందా అని రక్షణ నిపుణులు పెదవి విరుస్తున్నారు.
ఒమన్ తీరంలో రక్తం!
విషయం కేవలం మ్యాప్‌లతో ఆగలేదు, హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం జరిపిన ఒక ఆపరేషన్ లో ఒమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికులు దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. దీనిపై భారత్ అధికారికంగా నిరసన తెలిపింది. ఒక్కసారి ఆలోచించండి.. కమాండ్ పేరు నుండి భారత్‌ను తీసేశారు, తప్పుడు మ్యాప్‌తో సరిహద్దులను అవమానించారు, చైనాతో స్నేహం చేశారు, క్వాడ్‌ను పక్కనపెట్టారు, చివరికి భారతీయ పౌరుల ప్రాణాలు తీశారు.. ఇవన్నీ కేవలం మూడు వారాల వ్యవధిలోనే జరిగిపోయాయి!
కౌగిలింతలు లేవు.. కరచాలనాలే!
ఒకప్పుడు ట్రంప్-మోదీ భేటీలు అంటే భారీ ఆలింగనాలు గుర్తొచ్చేవి. “Howdy Modi”, అహ్మదాబాద్ ర్యాలీలు, కెమెరాల ముందు స్నేహ ప్రదర్శనలు. కానీ G7 సమావేశంలో ఆ దృశ్యం కనిపించలేదు. ట్రంప్, మోదీ కలిసినప్పుడు పాత ఉత్సాహం ఎక్కడా కనిపించలేదు. గతంలో కనిపించిన ఆత్మీయ కౌగిలింతలు (Bear Hugs) మాయమై, కేవలం ఒక బిగుతుగా ఉండే ఫార్మల్ కరచాలనం (Handshake) మాత్రమే చేసుకున్నారు. మోదీ నావికుల మరణాల గురించి ప్రశ్నిస్తే, ట్రంప్ చాలా నిర్లక్ష్యంగా “అది చాలా కష్టమైన వృత్తి” అని సమాధానమిచ్చారు. మాటల్లో మోదీని పొగిడినా, చేతల్లో మాత్రం అమెరికా తన అసలు రంగు చూపించింది.
అసలు ఆట ఇక్కడే!
అయితే ఇవన్నీ చూసి భారత్-అమెరికా సంబంధాలు బలహీనపడుతున్నాయని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే పైపైన కనిపించేది ఒకటి. లోపల జరుగుతున్నది మరోటి. 2025లో భారత వస్తువులపై భారీ టారిఫ్‌లు విధించిన అమెరికా, 2026లో వాటిని గణనీయంగా తగ్గించింది. భారత్ వందల బిలియన్ డాలర్ల అమెరికన్ ఇంధనం, టెక్నాలజీ, ఇతర ఉత్పత్తుల కొనుగోలుకు అంగీకరించింది. అరుదైన ఖనిజాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగానికి అవసరమైన ముడి పదార్థాలపై సహకారం పెరిగింది.అంటే మాటలు దూకుడుగా ఉన్నాయి. కానీ ఒప్పందాలు మరింత బలపడుతున్నాయి.
మౌనం వెనుక లెక్కలు
ఇక్కడే భారత్ అసలు వ్యూహం కనిపిస్తుంది. అమెరికా ఒక పదాన్ని తీసేసింది. భారత్ పెద్దగా స్పందించలేదు. అమెరికా మ్యాప్ విడుదల చేసింది. భారత్ రికార్డులో అభ్యంతరం తెలిపింది. అమెరికా చర్యల వల్ల భారతీయులు మరణించారు. భారత్ నిరసన తెలిపింది.అయినా వాణిజ్య చర్చలు ఆగలేదు. అదే “స్ట్రాటజిక్ ఆటానమీ”. భావోద్వేగాలతో కాదు. లెక్కలతో నడిచే విదేశాంగ విధానం. చైనా మీద ఆధారపడకూడదని అమెరికాతో దగ్గరవుతోంది. అదే సమయంలో అమెరికాపైనే పూర్తిగా ఆధారపడకుండా యూరప్, గల్ఫ్ దేశాలు, రష్యాతోనూ సంబంధాలు కొనసాగిస్తోంది.
ఏదైమైనా ప్రపంచ రాజకీయాల్లో స్నేహాలు శాశ్వతం కావు. శత్రుత్వాలు కూడా శాశ్వతం కావు. శాశ్వతంగా ఉండేది ఒక్కటే… దేశాల ప్రయోజనాలు. అమెరికా ఒక పదాన్ని తొలగించింది. భారత్ పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే ఢిల్లీకి తెలుసు, భావోద్వేగాలు వార్తలను నడిపిస్తాయి. కానీ ప్రయోజనాలే దేశాలను నడిపిస్తాయి. అయితే ఈ ఘటన ఒక ప్రశ్నను మాత్రం వదిలింది. అమెరికా “ఇండో” అనే పదాన్ని మాత్రమే తొలగించిందా? లేక భారత్‌కు ఇచ్చిన ప్రాధాన్యాన్ని కూడా కాస్త వెనక్కి తీసుకుందా?
ఆ ప్రశ్నకు సమాధానం ఈరోజు మ్యాప్‌లలో కనిపించకపోవచ్చు. ప్రకటనల్లో వినిపించకపోవచ్చు. కానీ రాబోయే సంవత్సరాల్లో జరిగే ఒప్పందాలు, కూటములు, వ్యూహాత్మక నిర్ణయాల్లో మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది.
ఎందుకంటే జియోపాలిటిక్స్‌లో కొన్నిసార్లు పెద్ద మార్పులు పెద్ద శబ్దంతో రావు. ఒక పదం మాయమవుతుంది… ఆ తర్వాత ప్రపంచ రాజకీయాలే మారిపోతాయి.








