అయోధ్యలో బ్రిటిష్పాలకుల కుట్ర… తిప్పికొట్టిన రామ్‌చరణ్ దాస్, అమీర్ అలీ
Ayodhya : చరిత్ర మనకు ఎంతసేపు యుద్ధాల గురించే చెప్తుంది కానీ,మోసపూరిత సామ్రాజ్యాలను కూల్చేసిన మహా స్నేహాల గురించి దాచేస్తుంది. నేడు మతం పేరిట జరుగుతున్న రాజకీయాలు, మనుషుల మధ్య పెరుగుతున్న దూరం చూస్తుంటే… ఒకప్పుడు ఇదే భారతదేశం… శత్రువు గుండెల్లో ఎలాంటి వణుకు పుట్టించిందో గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది.
అయోధ్య పేరు వినగానే ఇవాళ చాలామందికి వివాదాలు, రాజకీయాలు, కోర్టు తీర్పులే గుర్తొస్తాయి. కానీ ఇదే అయోధ్య నేలపై ఒకప్పుడు హిందూ, ముస్లింలు కలిసి రాసిన ఓ అద్భుతమైన ఐక్యత గాథ ఉందని ఎంతమందికి తెలుసు? ఒక హిందూ సన్యాసి, ఒక ముస్లిం నాయకుడు… ఇద్దరూ కలిసి బ్రిటిష్ కుట్రను తిప్పికొట్టారు. చివరికి అదే కారణంగా ఒకే చెట్టుకు ఉరితీయబడ్డారు. కానీ వారి మరణం ఓ చరిత్రను సృష్టించింది. ఆ కథే ఇప్పుడు మరచిపోయిన అయోధ్య అమరవీరుల కథ. బ్రిటిష్ వారిని భయపెట్టిన ఐక్యత. 1857లో భారత తొలి స్వాతంత్ర్య సమర జ్వాలలు దేశమంతా వ్యాపించాయి. బ్రిటిష్ పాలనను కూల్చివేయాలనే లక్ష్యంతో హిందూ, ముస్లింలు భుజం భుజం కలిపి పోరాడుతున్నారు. ఈ ఐక్యతే బ్రిటిష్లకు అతిపెద్ద ప్రమాదంగా కనిపించింది. ప్రత్యేకంగా అయోధ్యలో మత సామరస్యాన్ని దెబ్బతీయాలని నిర్ణయించిన ఈస్ట్ ఇండియా కంపెనీ, బాబ్రీ మసీదు ప్రాంగణంలో ఒక విభజన గోడ నిర్మించింది. రెండు వర్గాల మధ్య అనుమానాలు, ఉద్రిక్తతలు పెరిగితే స్వాతంత్ర్య ఉద్యమం బలహీనపడుతుందని వారు భావించారు. కానీ వారు ఊహించని విషయం ఒకటి జరిగింది.
గోడ కట్టారు… వంతెన పుట్టింది..
మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టి, లోపల కొట్టుకునేలా చేసి, తిరుగుబాటును నీరుగార్చాలనేదే ఆ తెల్లదొరల అసలు ప్లాన్. అంతా అనుకున్నట్టే జరుగుతుందనుకుని బ్రిటీష్ పాలకులు సంబరపడ్డారు కానీ, అక్కడ ఉన్న ఇద్దరి నైతిక బలాన్ని వారు అంచనా వేయలేకపోయారు. తెల్లవారి ప్లాన్‌ను తిప్పికొట్టడానికి ఆ ఇద్దరు నేతలు రంగంలోకి దిగారు. ఒకరు హిందూ సాధువు బాబా రాంచరణ్ దాస్, మరొకరు ముస్లిం ప్రముఖుడు అమీర్ అలీ. ఇద్దరూ ఒకే విషయాన్ని గ్రహించారు. హిందూ, ముస్లింలు ఒకరితో ఒకరు పోరాడితే గెలిచేది బ్రిటిష్లేనని. అందుకే వారు చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నారు.
1857లో జరిగిన మరచిపోయిన ఒప్పందం..
బాబా రామ్‌చరణ్ దాస్, అమీర్ అలీ కలిసి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు.ఒకే కాంప్లౌండ్లో, వేర్వేరుగా కేటాయించిన స్థలాల్లో ఇరు వర్గాలు పక్కపక్కనే ప్రార్థనలు చేసుకోవాలని నిర్ణయించారు. పరస్పర గౌరవం, వ్యూహాత్మక ఐక్యతకు నిదర్శనంగా నిలిచిన ఈ నిర్ణయం చూసి బ్రిటీష్ అధికారుల మైండ్ బ్లాంక్ అయింది. మతకల్లోలాలు సృష్టించి పబ్బం గడుపుకుందామనుకున్న తెల్లదొరల వ్యూహం పూర్తిగా అట్టర్‌ఫ్లాప్ అయింది.
ఇవి కూడా చదవండి
ఐక్యతకు చెల్లించిన ధర..
తమ కుట్రను విఫలం చేసిన ఈ ఇద్దరిపై బ్రిటీష్ ప్రభుత్వం కక్షగట్టింది. 1857 తిరుగుబాటును అణచివేసిన తర్వాత, ఈ ఐక్యతకు కారణమైన నేతలపై తెల్లదొరలు క్రూరంగా విరుచుకుపడ్డారు. 1858 మార్చి 18న బాబా రాంచరణ్ దాస్, అమీర్ అలీలను బంధించారు. రాజద్రోహం నేరం మోపి, అయోధ్యలోని కుబేర్ తిలా వద్ద ఉన్న ఒక చింతచెట్టుకు ఇద్దరినీ కలిపి ఉరితీశారు. దేశం కోసం ఒక హిందూ సాధువు, ఒక ముస్లిం నాయకుడి రక్తం అయోధ్య మట్టిలో కలిసిపోయి శాశ్వత ఐక్యతకు ప్రతీకగా మారింది. ఆ ఇద్దరూ ప్రాణాలు వదిలినా, వారు సృష్టించిన శాంతి ఒప్పందం చెక్కుచెదరకుండా నిలిచింది. జీవితంలో కలిసిన వారు, మరణంలోనూ విడిపోలేదు.
చెట్టు కింద పుట్టిన తిరుగుబాటు..
బ్రిటిష్‌లు ఇద్దరినీ చంపగలిగారు. కానీ వారు నిర్మించిన ఐక్యతను మాత్రం చంపలేకపోయారు. వారి మరణం తర్వాత కూడా దాదాపు వందేళ్ల పాటు ఆ శాంతి ఒప్పందం కొనసాగిందని చెబుతారు. అంతేకాదు, వారు ఉరితీయబడిన చింతచెట్టు ఒక చారిత్రక చిహ్నంగా మారింది. హిందూ, ముస్లింలు కలిసి అక్కడికి వెళ్లి నివాళులు అర్పించేవారు. ఆ చెట్టు కేవలం ఒక చెట్టు కాదు, బ్రిటిష్‌ల విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా నిలిచిన సజీవ సాక్ష్యం.
ఒక చెట్టును నరికేశారు… కానీ అది దాచిన చరిత్రను ఎందుకు నరికేయలేకపోయారు?
కాలక్రమేణా కుబేర్ తిలా వద్ద ఉన్న ఆ చింతచెట్టు ఒక పవిత్ర క్షేత్రంగా మారింది. హిందువులు, ముస్లింలు కలిసి అక్కడికి వెళ్లి ఆ ఇద్దరు వీరులకు నివాళులర్పించేవారు. మత సామరస్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ స్థలాన్ని చూసి బ్రిటీష్ పాలన శతాబ్దం తర్వాత కూడా భయపడింది. ప్రజల్లో ఆ స్వాతంత్ర్య కాంక్షను, ఐక్యతను పూర్తిగా తుడిచేయాలనే దుర్బుద్ధితో, 1935లో బ్రిటీష్ ప్రభుత్వం ఆ పవిత్రమైన చింతచెట్టును నరికేసింది. చెట్టును తొలగిస్తే జ్ఞాపకం కూడా మాయమవుతుందని వారు అనుకున్నారు. కానీ చరిత్రకు వేర్లు ఉంటాయి. వాటిని నరికేయడం ఎవరి వల్లా కాదు.
ఇంకా ఎందుకు గుర్తుంచుకోవాలి?
బాబా రామ్‌చరణ్ దాస్, అమీర్ అలీ కథ కేవలం గతానికి చెందిన సంఘటన కాదు. భిన్న విశ్వాసాలు ఉన్నవారు కలిసి జీవించగలరని, పరస్పర గౌరవం కోసం అవసరమైతే ప్రాణాలు కూడా అర్పించగలరని నిరూపించిన అరుదైన ఉదాహరణ. నేడు అయోధ్య గురించి అనేక కథలు వినిపిస్తాయి. కానీ ఒక హిందూ సన్యాసి, ఒక ముస్లిం నాయకుడు కలిసి రాసిన ఈ ఐక్యత గాథ మాత్రం చాలా మందికి తెలియదు. నేటి సమాజంలో మతాల మధ్య గోడలు కడుతున్న వారికి ఈ చరిత్ర ఒక గుణపాఠం.








