రెండోవిడతలో వారికే మొదటి ప్రాధాన్యత :మంత్రి పొంగులేటి
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) అధికారులను ఆదేశించారు. హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 వేల మంది గుడిసెల్లో నివసిస్తున్నామని ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నారని, వాటన్నింటిని ప్రత్యక్షంగా పరిశీలించి అర్హులను గుర్తించాలని సూచించారు. గుడిసెల్లో నివసిస్తూ గతంలో ప్రజాపాలన లేదా ఇతర కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకోనివారు ఇప్పుడు మళ్లీ స్థానిక ఎంపీడీవో (MPDO) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
రెండో విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి (Assembly constituency)500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇళ్లకు ప్రభుత్వం రూఫ్ రీప్లే్సమెంట్ వెసులుబాటు కల్పించిందన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పైకప్పుల కింద నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను గుర్తించి వారికి ఆర్సీసీ స్లాబ్ నిర్మాణం కోసం రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. అలాగే గతంలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇళ్లను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలని ఆదేశించారు. గృహలక్ష్మి పథకం కింద నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన గృహాలను కూడా గుర్తించి రూఫ్ అప్గ్రేడేషన్ కార్యక్రమం ద్వారా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.








