మీ రక్షణ మీరే చూసుకోండి.. నాటో దేశాలకు తేల్చి చెప్పిన అమెరికా..!
పశ్చిమాసియా సంక్షోభ సమయంలో ఇరాన్ పై దాడులకు తమ భూభాగాలను యూరోపియన్ మిత్రులు.. ఇచ్చేందుకు నిరాకరించారని అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తద్వార అనేకమంది అమెరికన్ల ప్రాణాలు ప్రమాదంలో పడేశాయని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ విరుచుకుపడ్డారు.ఇది చాలా సిగ్గుచేటు అని విమర్శించారు. బ్రస్సెల్స్ వేదికగా నాటో (NATO) సభ్యదేశాల రక్షణశాఖ మంత్రులతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ మేరకు మాట్లాడారు.
ఈ క్రమంలోనే యూరప్ లోని అమెరికా దళాలపై ఆరు నెలల రివ్యూ ప్రోగ్రామ్‌ను హెగ్సెత్ ప్రకటించారు. యూరోపియన్ కంట్రీస్ … తమ సొంత భద్రతకు ఎంత వేగంగా చర్యలు తీసుకుంటాయనే దానిపై రివ్యూ ఫలితం ఆధారపడి ఉంటుందన్నారు. ‘‘మేం సీరియస్‌గా సమీక్ష చేస్తాం. వారి రక్షణకు అక్కడి దేశాలే ప్రాథమిక బాధ్యత వహించడానికి ముందుకు వచ్చేలా చూడటానికే ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించాం’’ అని తెలిపారు.
హర్మూజ్‌ను తెరిపించేందుకు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన విజ్ఞప్తిని యూరోపియన్ దేశాలు పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహానికి గురైన ఆయన.. నాటో నుంచి వైదొలిగే యోచనలో ఉన్నామని పలుమార్లు ప్రకటించారు. నాటో కూటమికి అందిస్తోన్న సాయాన్ని కత్తిరించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనలు చేస్తోంది. యూరోపియన్ యూనియన్ లో నాటో కార్యకలాపాల కోసం అందుబాటులో ఉంచిన విమానాలు, యుద్ధనౌకలను తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం.








