ఐఎస్ఐ గుప్పిట్లోనే పాక్ ప్రభుత్వం.. ఖవాజా ఆసిఫ్ సంచలన ప్రకటన..!
పాకిస్తాన్.. నిత్య సంక్షోభిత దేశం. కొన్నాళ్లు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పాలన చేస్తే.. మరికొన్నేళ్లపాటు సైనిక ప్రభుత్వాలు అధికారం చలాయించిన చరిత్ర పాక్ ది. అంతేకాదు.. పాలన ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ.. ఆ ప్రభుత్వం సైనికచీఫ్ మాటకు జీ హుజూర్ అనాల్సిందే. లేదంటే .. ఆప్రభుత్వం ఎన్నాళ్లో పాలన చేయలేదు. కుప్పకూలిపోవాల్సిందే. సైనిక కుట్రకు బలికావాల్సిందే. ఇది పాక్ రాజకీయ చరిత్ర. ఈ విషయం ప్రపంచానికంతటికీ తెలుసు. అయితే.. దాన్ని స్వయంగాపాక్ రక్షణ మంత్రి చట్టసభ సాక్షిగా అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పాక్ జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో ఖవాజా (Khawaja Asif) మాట్లాడుతూ.. ‘‘ఇమ్రాన్ ఖాన్ హయాంలో ఐఎస్ఐకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాడు నిఘా సంస్థ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ తరచూ అధికారిక సమావేశాల్లో పాల్గొన్నారు. నాటి స్పీకర్ నివాసంలో జరిగిన సమావేశాలకు హాజరై.. చట్టసభ కార్యకలాపాలు, నిర్ణయాలను ప్రభావితం చేశారు. ఐఎస్ఐ ఒత్తిడి కారణంగా అప్పట్లో కొన్ని కీలక చట్టసవరణలు చేయాల్సి వచ్చింది. యాంటీ మనీలాండరింగ్ చట్ట సవరణ అలా జరిగిందే. అంతేగాక, నిఘా సంస్థకు అనుకూలంగా కొన్ని చట్టాలను అమల్లోకి తెచ్చారు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, తమ ప్రభుత్వం మాత్రం సైన్యంతో కలిసి పనిచేస్తోందని ఖవాజా ఈ సందర్భంగా తెలిపారు. తమ ప్రభుత్వం పౌర-సైనిక హైబ్రిడ్ పాలనా విధానాన్ని అనుసరిస్తోందని, దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నట్లు తెలిపారు. అయితే.. ఖవాజా ఎంతగా కవర్ చేసినా.. సైనిక చీఫ్ ప్రభావం..ఆదేశంపై కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఇటీవల పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా చర్చల సందర్భంగా.. పాక్ ప్రభుత్వ నేతల కన్నా.. ముందుగా, ముఖ్యంగా సైనిక చీఫ్ ఆసిం మునీర్ సందడి చేశారు. ఇరాన్ , అమెరికా ప్రతినిధులను స్వాగతించే అంశంలోనూ మునీర్ పాత్ర కొట్టొచ్చినట్లు కనిపించింది.








