ఆ ప్రాజెక్టుకు కేంద్రం వ్యతిరేకం కాదు : రాంచందర్ రావు
మెట్రో (Metro)విస్తరణ ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు (Ramchander Rao) ఆరోపించారు ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టు, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్టు, డీపీఆర్లను ఇప్పటి వరకు సమర్పించలేదన్నారు. అవసరమైన సాంకేతిక పత్రాలు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్రం వ్యతిరేకం కాదని, ఆ ప్రాజెక్టును తిరస్కరించలేదని స్పష్టం చేశారు. మెట్రో స్వాధీనానికి సంబంధించిన రుణం విషయంలోనూ కేంద్రం సూచనలు పాటించకుండా మండిపడ్డారు. మెట్రో రుణం మంజూరు, విస్తరణ ప్రాజెక్టు ఆలస్యానికి కేంద్రంగానీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) గానీ కారణం కాదని, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధిపై ఆసక్తి లేదని, కేవలం స్కాములు, కమీషన్ల రాజకీయాలపైనే అనుభవం ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రూ.13లక్షల కోట్లు అందించిందన్నారు. అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించే గోబెల్స్ తరహా ప్రచారాన్ని కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ (BJP)పై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవుపలికారు.








