తిరస్కరణ నుండి అగ్రస్థానం వరకు.. స్టార్‌బక్స్ వెనుక ఉన్న అసలు రహస్యం
స్టార్‌బక్స్ (Starbucks) ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన గ్లోబల్ బ్రాండ్‌గా ఎదగడం వెనుక ఉన్న ఆసక్తికరమైన ప్రయాణం ఎందరో వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిస్తోంది. స్టార్‌బక్స్ వ్యవస్థాపకులు ఒకప్పుడు తిరస్కరించిన ఒకే ఒక్క ఐడియా, నేడు ఆ సంస్థను ప్రపంచ స్థాయికి ఎలా చేర్చిందో తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి
మిలన్ పర్యటనతో మొదలైన మార్పు..
1983లో స్టార్‌బక్స్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న హోవార్డ్ షుల్జ్, ఇటలీలోని మిలన్ నగరానికి వెళ్లారు. అక్కడ కాఫీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదని, అది ఒక అద్భుతమైన అనుభూతి అని ఆయన గుర్తించారు. కస్టమర్లతో బరిస్టాలకున్న( కాఫీ మాస్టర్) అనుబంధం, ఆ కాఫీ బార్ల వాతావరణం ఆయనను బాగా ఆకట్టుకున్నాయి. ఈ ‘ఇటాలియన్ కాఫీ కల్చర్’ను అమెరికాలో కూడా ప్రవేశపెట్టాలని ఆయన భావించారు.
తిరస్కరణ..
హోవార్డ్ షుల్జ్ తన ఐడియాను స్టార్‌బక్స్ వ్యవస్థాపకుల ముందు ఉంచగా, వారు దానిని తిరస్కరించారు. తాము కేవలం కాఫీ గింజలను విక్రయించే సంస్థగానే కొనసాగుతామని, రెస్టారెంట్ వ్యాపారంలోకి రామని వారు స్పష్టం చేశారు. దీంతో నిరాశ చెందకుండా, షుల్జ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, సొంతంగా ‘ఇల్ జియోర్నాలే’ (Il Giornale) పేరుతో చిన్న ఎస్ప్రెస్సో బార్‌ను ప్రారంభించారు. కేవలం సంవత్సరాలలోనే ఇది విశేష ప్రజాదరణ పొందింది.
తమనే తిరస్కరించిన కంపెనీని కొనేసిన షుల్జ్..
1987లో స్టార్‌బక్స్ యాజమాన్యం తమ సంస్థను విక్రయించాలని నిర్ణయించుకోగా, షుల్జ్ ఇన్వెస్టర్ల ద్వారా నిధులు సేకరించి ఆ సంస్థను 3.8 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత స్టార్‌బక్స్‌ను ఒక సాధారణ కాఫీ షాప్ నుండి ‘థర్డ్ ప్లేస్’ (ఇల్లు, ఆఫీస్ తర్వాత ప్రశాంతంగా గడిపే మూడో ప్రదేశం)గా మార్చివేశారు.
నేటి స్టార్‌బక్స్ ప్రస్థానం..
కప్పుపై కస్టమర్ పేరు రాయడం, ఆహ్లాదకరమైన వాతావరణం, సౌకర్యవంతమైన సీటింగ్ వంటి వినూత్న పద్ధతులతో షుల్జ్ స్టార్‌బక్స్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. కేవలం పదేళ్లలో 1,000 స్టోర్ల మైలురాయిని దాటిన ఈ సంస్థ, నేడు 84 దేశాలలో 36,000 పైగా స్టోర్లతో అగ్రగామిగా కొనసాగుతోంది. కేవలం ఒక వస్తువును అమ్మడమే కాకుండా, కస్టమర్ల భావోద్వేగాలను అర్థం చేసుకుంటే వ్యాపారంలో తిరుగులేని విజయం సాధించవచ్చని హోవార్డ్ షుల్జ్ నిరూపించారు.








