హైదరాబాద్లో జూన్ 24న ‘WETA ఇండియా’ ప్రారంభం.. మహిళా సాధికారతే లక్ష్యం
WETA: మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో ‘ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్’ (WETA) ఇండియాను జూన్ 24న హైదరాబాద్లో అధికారికంగా ప్రారంభించనున్నారు. హనుమండ్ల ఝాన్సీ రెడ్డి స్థాపించిన ఈ సంస్థ, తెలుగు సంస్కృతికి అనుగుణంగా నాయకత్వం, విద్య, సామాజిక సేవ , కుటుంబ విలువల బలోపేతానికి ఒక బలమైన వేదికను కల్పించనుంది. జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
సంస్థ ముఖ్య ఉద్దేశం..
ఈ ఉద్యమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని మహిళా నాయకులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు , సామాజిక కార్యకర్తలను ఒకే వేదికపైకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం మహిళలను భాగస్వాములుగానే కాకుండా, కుటుంబాలు , సమాజ నిర్మాణంలో వారిని ముఖ్యమైన పాత్రధారులుగా తీర్చిదిద్దడమే ఈ సంస్థ ఉద్దేశం. భవిష్యత్తులో నాయకత్వ కార్యక్రమాలు, నెట్వర్కింగ్ ఫోరమ్లు , సమాజ సేవా కార్యక్రమాల ద్వారా కొత్త తరం మహిళా నాయకులను ప్రోత్సహించేందుకు WETA ఇండియా ప్రణాళికలు సిద్ధం చేసింది. “ఎంపవరింగ్ ఉమెన్, ఎన్రిచింగ్ ఫ్యామిలీస్, ఇన్స్పైరింగ్ జనరేషన్స్” అనే నినాదంతో ప్రారంభం కానున్న ఈ ఉద్యమం, సామాజిక మార్పు , అభివృద్ధి దిశగా అడుగులు వేయనుంది.








