ఈ ప్రక్రియపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి అజారుద్దీన్
ఓటరు జాబితా పరిశీలనకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా తొలగిస్తున్న ఓట్లలో మైనార్టీల (minorities) ఓట్లే అధికంగా ఉంటున్నాయని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ (Minister Azharuddin) పేర్కొన్నారు. గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్ పాల్గొన్నారు. వివిధ సమస్యలకు సంబంధించి ప్రజలు, కాంగ్రెస్ (Congress) కార్యకర్తల నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బిహార్ (Bihar), బెంగాల్ ( Bengal)లలో నిర్వహించిన ఎస్ఐఆర్లలో ఇదే జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి చేపట్టనున్న ఎస్ఐఆర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో అర్హత గల వారి ఓట్లు పోకుండా తామూ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో 200కు పైగా దరఖాస్తులు, వినతిపత్రాలు వచ్చాయని చెప్పారు. తనకు సమర్పించిన వాటిలో 50కి పైగా పిటిషన్లను కలెక్టర్లు, అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించానని తెలిపారు.








