Jublihills Bypoll: మంత్రి అజారుద్దీన్ టార్గెట్ గా జూబ్లీహిల్స్ బైపోల్ పాలిటిక్స్…!
 
                                    జూబ్లీహిల్స్ బైపోల్ లో గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ కు మంత్రిపదవి వరించింది.దీంతో ఈ అంశం పెను వివాదంగా మారింది. జూబ్లీహిల్స్ బైపోల్స్ (Jublihills Bypoll) లో గెలిచేందుకు, మైనార్టీ వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్.. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిందని బీజేపీ ఆరోపించింది. అసలు ఎన్నికల వేళ.. ఈ మంత్రిపదవి ఎలా ఇస్తారంటూ ఈసీకి లేఖ రాసింది బీజేపీ..
తనకు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేత కిషన్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, తనకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని స్పష్టం చేశారు మహమ్మద్ అజారుద్దీన్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తనపై వచ్చినవి ఆరోపణలు మాత్రమేనని అన్నారు. బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు సరికాదని ఆయన అన్నారు. తనపై ఒక్క కేసులో కూడా నేరం రుజువు కాలేదని ఆయన స్పష్టం చేశారు.
తన గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పూర్తిస్థాయి అవగాహన లేదని వ్యాఖ్యానించారు. తన దేశభక్తి గురించి విమర్శలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనకు మంత్రి పదవి రావడానికి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి …టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇస్తే బీజేపీ నేతలకు అంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు. ఆయనపై ఏం కేసులు ఉన్నాయో సమాధానం చెప్పాలని ఆయన కిషన్ రెడ్డిని నిలదీశారు.
భారత జట్టు సారథిగా ఆయన ఎన్నో విజయాలను అందించారని అన్నారు. ఎంపీగా ప్రజలకు సేవ చేశారని తెలిపారు. అలాంటి అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని బీజేపీ నేతలు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.











 
                                                     
                                                        