ముమ్ముట్టి, మోహన్ లాల్ ‘పేట్రియాట్’ మూవీ రివ్యూ! -డేటా ప్రైవసీపై షాకింగ్ థ్రిల్లర్!
Rating: 2.25
–సూర్య ప్రకాష్ జోశ్యుల
DRW అనే అత్యున్నత డిఫెన్స్ సంస్థలో సైంటిస్ట్‌గా పనిచేస్తూంటాడు డేనియల్ జేమ్స్ (ముమ్ముట్టి). ఆయనకి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ల పనితీరుపై, వాటి ద్వారా జరిగే డేటా లీ కేజీలపై అపారమైన పట్టు ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పంపిణీ చేసిన ల్యాప్ టాప్లలో అమర్చిన రహస్య కెమెరాలు, స్పైవేర్ సాఫ్ట్వేర్ ద్వారా బాలికలను లైంగికంగా వేధిస్తున్నా రనే సంచలన విషయాన్ని ఆయన గుర్తిస్తాడు. ఈ అక్రమాల వెనుక మినిస్టర్ జెపి సుందరంతో పాటు ఆయన కొడుకు శక్తి సుందరం (ఫహాద్ ఫాసిల్) కి చెందిన ‘శక్తి సొల్యూషన్స్’ సంస్థ ఉందని తెలుసుకుంటాడు. దాంతో ఆయనకు తెలియకుండా ప్రమాదంలో పడతాడు.
దేశ భద్రతకే ముప్పుగా మారిన ఈ స్కామ్ ను బయటపెట్టేందుకు ప్రయత్నించిన డేనియల్ను పెద్ద స్టాయిలో వ్యక్తుల టార్గెట్ చేస్తారు. డేనియల్ జేమ్స్ పై రాత్రికి రాత్రే దేశ ద్రోహి అనే ముద్ర వేస్తారు. పవర్ఫుల్ పొలిటీషియన్స్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్‌తో ప్రాణాలను దక్కించుకోవడానికి డేనియల్ ఇండియా వదిలి లండన్‌కు పారిపోవాల్సి వచ్చింది. అయితే అక్కడ కూడా ఆయన ఊరుకోలేదు. ‘విమదన్’ అనే యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ డిజిటల్ మాఫియా నెట్వర్క్ కుట్రలను, తన అనుభవాలను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలోనే డేనియల్ను శాశ్వతంగా మట్టుబెట్టడానికి శక్తి సుందరం లండన్‌లో హత్యా ప్రయత్నం చేయిస్తాడు. మరో ప్రక్క ఈ గుట్టురట్టు చేయాలని చూసిన మినిస్టర్ నళిని రామకృష్ణన్ (రేవతి) అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. అప్పుడు ఏమైంది… రహీం నాయక్ (మోహన్ లాల్) ఎలా డేనియల్ కు అండగా నిలిచాడు? డేనియల్ భార్య లతిక (నయనతార) భర్తకు ఎందుకు దూరంగా ఉంటోంది? వంటి ప్రశ్నలన్నిటి కీ సమాధానం తెలియాలంటే ‘పేట్రియాట్’ సినిమా చూడాల్సిందే.
ఎనాలిసిస్
ఈ రోజుల్లో డేటా ని కొత్త చమురు (Oil) అని అంటున్నారు. కానీ నిజానికి డేటా.. చమురు కంటే ప్రమాదకరమైనది. ఎందుకంటే చమురును దొంగిలిస్తే డబ్బు పోతుంది, డేటాను దొంగిలిస్తే మనిషి జీవితమే ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కాబట్టే Patriot లాంటి సినిమాలు కేవలం థ్రిల్లర్లు కావు, ఆధునిక సమాజానికి అవసరమైన హెచ్చరికలుగా కనిపిస్తాయి.
నిజానికి ఇదేమీ కొత్త పాయింట్ తో వచ్చిన సినిమా కాదు. వరల్డ్ సినిమాలో డేటా సర్వై లెన్స్, ప్రభుత్వ నిఘా, కార్పొరేట్ గూఢచర్యం గురించి ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. Enemy of the State, Snowden, Black Mirror, The Lives of Others వంటి సినిమాలు ఇదే భయాన్ని వేరువేరు కోణాల్లో చూపించాయి. కానీ Patriot ప్రత్యేకత ఏమిటంటే, అది ఈ అంశాన్ని “సినిమాటిక్ గిమ్మిక్”గా కాకుండా, మన రోజువారీ జీవితంలో జరుగుతున్న సాధారణ వాస్తవంలా చూపిస్తుంది.
స్క్రీన్ రైటింగ్‌లో ఒక గొప్ప మాట ఉంది. “The audience loves to work for their meal.” — William Goldman
అంటే ప్రేక్షకుడికి ప్రతి విషయం వివరించి చెప్పొద్దు. అతడే అర్థం చేసుకునే అవకాశం ఇవ్వాలి. Patriot ఫస్టాప్ ఈ మాటకి అద్భుత ఉదాహరణ. డేనియల్ జేమ్స్‌ను పరిచయం చేసే సన్నివేశాలు చూస్తే, అతను హీరోలా కనిపించడు. అతని ఎంట్రీకి భారీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేదు. మాస్ డైలాగులు లేవు. కానీ అతని చుట్టూ జరుగుతున్న సంభాషణలు, అతని పరిశీలనలు, అతను సేకరించే చిన్న చిన్న సమాచారం ద్వారా మనం అతని ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటాం. డైరెక్టర్ మహేష్ నారాయణన్ ఇక్కడ ప్రేక్షకుడు కథను చూస్తున్నట్టు కాకుండా..కథను డీకోడ్ చేస్తున్నట్టు ఫీలయ్యేలా చేసాడు.
అలాగే ఈ స్క్రీన్‌ప్లే అసలు ట్రిక్… విలన్‌ను ఆలస్యంగా మనకు అర్థం అయ్యేలా చేయడం. ఫస్టాఫ్ లో శక్తి సుందరం గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ ప్రతి సీన్‌తో అతని ఇంపాక్ట్ పెరుగుతూ కనిపిస్తుంది. ప్రతి సాక్ష్యం వెనుక అతని నీడ కనిపిస్తుంది.ప్రతి మరణం వెనుక అతని పవర్ కనిపిస్తుంది. అలా స్క్రిప్ట్ ప్రేక్షకుడుని విలన్ వైపు మెల్లిగా తీసుకెళ్లేలా , దగ్గరకు తీసుకెళ్లి షాక్ ఇస్తాడు.
ఇది Christopher Nolan తరచుగా ఉపయోగించే టెక్నిక్. మొదట సమస్య కనిపిస్తుంది. తర్వాత వ్యవస్థ కనిపిస్తుంది. చివరికి వ్యవస్థ వెనుక ఉన్న రాక్షసుడు కనిపిస్తాడు. Patriot కూడా అదే మార్గంలో ప్రయాణిస్తుంది.అలా కాస్త రెగ్యులర్ సినిమాకు దూరంగా కొత్తగా ప్రయత్నం చేసారు.
ఈ క్రమంలో ఫస్టాఫ్ మొత్తం …ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు?, ఎవరు ఎవరిని ట్రాక్ చేస్తున్నారు?, ఎవరి ఫోన్ సురక్షితం?, ఎవరు తదుపరి లక్ష్యం? ఈ ప్రశ్నలే ప్రేక్షకుడిని ముందుకు నడిపిస్తాయి.
సెకండాఫ్ లో కథ నుంచి యాక్షన్ వైపు టర్న్ తీసుకుంటుంది. ఇక్కడే సినిమా కొంచెం తడబడుతుంది . ఎందుకంటే యాక్షన్ కథకు తగ్గ స్థాయిలో ఉండదు. ముఖ్యంగా మోహన్‌లాల్ ఎంట్రీ తర్వాత వచ్చే ఛేజ్ సీక్వెన్స్, హాస్పిటల్ ఫైట్ వంటి సన్నివేశాలు ప్రేక్షకుడు ఊహించిన స్థాయిలో ఎలివేట్ కాలేదు. సమస్య యాక్షన్‌లో లేదు. యాక్షన్ డిజైన్‌లో ఉంది. ఫస్టాఫ్ లో చూపిన టెన్షన్ కు తగిన పే-ఆఫ్ ఆ సన్నివేశాల్లో కనిపించదు.విజువల్ పే-ఆఫ్ ఇవ్వదు.అందుకే సెకండాఫ్ .. పెద్ద ఎఫెక్టివ్‌గా అనిపించదు. సోసోగా అనిపిస్తుంది.
ఎవరెలా ..
మమ్ముట్టి తన భుజాలపై మొత్తం కథను మోసే నటుడిగా మరోసారి నిరూపించుకోగా, మోహన్‌లాల్ తన పరిమిత స్క్రీన్ టైమ్‌తోనే చిత్రానికి అదనపు భావోద్వేగ బరువును తీసుకొచ్చాడు. ఫాహద్ ఫాజిల్, కుంచాకో బోబన్, జరీన్ షిహాబ్, రాజీవ్ మీనన్ వంటి నటులు కూడా తమ పాత్రలకు అవసరమైన నమ్మకాన్ని అందించారు. టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ తో వచ్చిన సినిమా ఇది.
ఫైనల్ థాట్
దర్శకుడు మహేష్ నారాయణన్ ఇక్కడ కొత్త కథను చెప్పటం కన్నా కథ చెప్పే విధానాన్ని కొత్తగా మార్చటం మీదే దృష్టి పెట్టారు. ప్రేక్షకుడికి ప్రతి విషయాన్ని వివరించి చెప్పకుండా, అతడిని కథలో భాగస్వామిని చేయటానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా, Patriot ప్రేక్షకుడిని అమాయకుడిగా చూడదు. “చూడండి, ఇదే నిజం” అని అరవదు. బదులుగా కొన్ని ప్రశ్నలు వేస్తుంది. మన ఫోన్ లేదా ల్యాప్ ట్యాప్ నిజంగా మనదేనా? అందులో ఉన్న మన డేటా నిజంగా సురక్షితమేనా? ప్రైవసీ అనేది హక్కా, లేక మనం నమ్ముతున్న ఒక భ్రమా? . వీటికి సమాధానాలు మనకు మనమే చెప్పుకోవాలి.
ఎక్కడ చూడచ్చు
జీ 5 ఓటిటిలో ఈ సినిమా తెలుగులో ఉంది.








