కాంగ్రెస్ నుంచి వేరుపడ్డ పార్టీలన్నీ మళ్లీ కాంగ్రెస్ లోకి…. ముహూర్తం మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు…
ప్రధాని నరేంద్ర మోదీని, ఎన్డీయే ఎదుర్కోడానికి కాంగ్రెస్ భారీ స్కెచ్ వేస్తోంది. ‘‘అఖండ కాంగ్రెస్’’ దిశగానే అడుగులు వేస్తోంది. ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ లో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు పంపుతోంది. దీంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బయటకువెళ్లి, పార్టీలు పెట్టిన నేతలను సొంతగూటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టింది. నేతలే కాదు, పార్టీలు సైతం విలీనానికి ప్రాథమిక దశలో సానుకూలంగా వుంటూ, చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ లో కలిపేసి, బలమైన శక్తిగా మారాలని ఆ ప్రాంతీయ పార్టీల నేతలు ఆలోచనలో వున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన చర్లు కూడా కొనసాగుతున్నాయి.
మొదట ఈ విలీన ప్రతిపాదన తృణమూల్ కాంగ్రెస్ తో ప్రారంభమైంది.బెంగాల్ లో ఓటమి పాలైన తర్వాత, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఒక్క సారిగా పైకి వచ్చేసింది. ఏకంగా 20 మంది తాము ఎన్డీయేలో చేరేందుకు సిద్ధంగా వున్నామని ఎంపీలు ప్రకటించారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ లో వివాదం రేగింది. అలాగే అభిషేక్ బెనర్జీ చుట్టూ వివాదాలు చుట్టుకున్నాయి. అంతలోనే ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం కూడా జరిగింది. కొన్ని రోజులుగా ఇండియా కూటమి సమావేశాలకు మమతా దూరంగా వుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే బెంగాల్ లో ఓడిపోయారో, ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు.
ఇంతలోనే తృణమూల్ ను కాంగ్రెస్ లో కలిపేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీని ద్వారా ఇరు పార్టీలకు కూడా లాభం చేకూరుతుందని, ఇందుకు సోనియా, ప్రియాంక, రాహుల్ డీల్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతలోనే సోనియా, మమత భేటీ కూడా జరిగింది. అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కోడానికి విలీనం చేయాలని భావించారు. గతంలో కాంగ్రెస్ నుంచి విడిపోయి పార్టీ పెట్టుకున్న వారంతా తిరిగి కాంగ్రెస్ లో విలీనం చేయాలన్న ప్రతిపాదనలు జోరందుకున్నాయి.
అలాగే తాజాగా మరో వార్త కూడా హల్ చల్ చేస్తోంది. ఎన్సీపీ శరద్ పవార్ కూటమి కూడా కాంగ్రెస్ లో విలీనం అయ్యే అవకాశాలు వున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1999 లో కాంగ్రెస్ తో విభేదించి శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించారు. సోనియా గాంధీ విదేశీయతను పవార్ ప్రశ్నించడంతో కాంగ్రెస్ బహిష్కరించింది. అలాగే సంగ్మా, తారీఖ్ అన్వర్ ను కూడా బహిష్కరించారు. వీరు ముగ్గురు కలిసి ఎన్సీపీని స్థాపించారు. టీఎంసీ మాదిరిగానే ఎన్సీపీలోనూ సంక్షోభం వుంది. అజిత్ పవార్ నాయకత్వంలో తిరుగుబాటు బావుటా ఎగరేశారు. దీంతో పార్టీ చీలిపోయింది. అయితే విలీన ప్రతిపాదన తమ వద్దకు రాలేదని సుప్రియా సూలే ప్రకటించారు. తాము కూడా అలా అనుకోవడం లేదని ప్రకటించారు. అలాగే మరి కొందరు కూడా కాంగ్రెస్ లో విలీనం అవ్వాలని కాంగ్రెస్ ప్రతిపాదనలు పంపింది.








