టాటాలను తిరిగి బెంగాల్ కి తీసుకొస్తాం : కీలక ప్రకటన చేసిన సువేందు.. అసలు అప్పట్లో ఏం జరిగిందంటే
బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. టాటాలను తిరిగి బెంగాల్ కి తీసుకొస్తామని ప్రకటించారు. భూసేకరణపై నిరసనల కారణంగా 2008 లో సింగూర్ నుంచి టాటా మొటార్స్ నానో ప్రాజెక్ట్ వైదొలిగిన తర్వాత, ఆ సంస్థ తిరిగి బెంగాల్ కి రాలేదన్నారు. దాదాపు 17 సంవత్సరాల అనంతరం బెంగాల్ పారిశ్రామిక పునరుద్ధరణలో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున టాటా గ్రూప్ పెట్టుబడులు తీసుకురావడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. త్వరలోనే బెంగాల్ పారిశ్రామిక వైభవాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించారు.
అసలు అప్పట్లో ఏం జరిగిందంటే..
నానో కారు… మధ్యతరగతికి అప్పట్లో కల. దీని కోసం 2006 లో బెంగాల్ లోని హుగ్లీ జిల్లా సింగూరులో టాటా మోటార్స్ నానో కార్ల తయారీ కర్మాగారానికి అప్పటి సీపీఎం సర్కార్ 1000 ఎకరాల భూమిని సేకరించింది. అయితే.. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా మమతా నేతృత్వంలో భారీ ఉద్యమమే చేపట్టింది. అందులో మమతా బెనర్జీ, ఇప్పటి సీఎం సువేందు అధికారి కీలక పాత్ర పోషించారు. తీవ్ర నిరసనల కారణంగా 2008 లో టాటా గ్రూపు ఆ ప్రాజెక్టు బెంగాల్ నుంచి గుజరాత్ కి తరలిపోయింది.
రైతుల వ్యతిరేకత ఎందుకు వచ్చింది?
ఉద్యమానికి ప్రధాన కారణాలు ఇవి:
బలవంతపు భూసేకరణ ఆరోపణలు – అనేక మంది రైతులు తమ భూమిని స్వచ్ఛందంగా ఇవ్వలేదని చెప్పారు. సారవంతమైన వ్యవసాయ భూమి కోల్పోవడం – సింగూర్ ప్రాంతం అధిక దిగుబడులు ఇచ్చే వ్యవసాయ ప్రాంతం. పరిహారం పట్ల అసంతృప్తి – కొంతమంది రైతులు ఇచ్చిన నష్టపరిహారం సరిపోదని భావించారు. వ్యవసాయం వర్సెస్ పరిశ్రమ – పరిశ్రమల కోసం రైతుల జీవనాధారాన్ని త్యాగం చేయకూడదని ఉద్యమకారులు వాదించారు.
ఉద్యమం ఎలా పెరిగింది?
2006–2008 మధ్య నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు జరిగాయి. రైతులు, సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాటం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం దాదాపు పూర్తికావచ్చే దశకు వచ్చినప్పటికీ వివాదం కొనసాగింది. భద్రతా సమస్యలు, నిరసనల కారణంగా టాటా మోటార్స్ ప్రాజెక్టును కొనసాగించడం కష్టమైందని తెలిపింది.








