‘ఈ100’ బయో ఇంధన వినియోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
అంతర్జాతీయ మార్కెట్లో తరచూ తలెత్తే చమురు సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఆటోమొబైల్, ఇంధన రంగాల రూపురేఖలను సమూలంగా మార్చేసే సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. వాహనాల్లో నూరు శాతం ఇథనాల్‌ను (E100 Fuel) చట్టబద్ధమైన ఇంధనంగా వినియోగించేందుకు అనుమతిస్తూ రూపొందించిన రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌పై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంతకం చేశారు. దేశవ్యాప్తంగా వంద శాతం బయోఫ్యూయల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన అధికారిక డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.
‘ఈ20’ నుంచి ‘ఈ100’ వైపు అడుగులు..
ప్రస్తుతం దేశ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం ముడిచమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తిన ప్రతిసారీ దేశీయ ఆర్థిక వ్యవస్థ డోలాయమానంలో పడుతోంది. ఈ విదేశీ ఆధారిత విధానానికి స్వస్తి పలికేందుకే ప్రభుత్వం ‘ఇథనాల్ బ్లెండింగ్’ (పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం) వ్యూహాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే 20 శాతం ఇథనాల్ కలిపిన ‘ఈ20’ ఇంధనం దేశవ్యాప్తంగా దాదాపు విజయవంతంగా అమలవుతుండగా, ఇటీవల ఢిల్లీలో తొలిసారిగా ‘ఈ85’ (85 శాతం ఇథనాల్) బంక్‌ను సైతం ప్రారంభించారు. క్రమంగా ఇథనాల్ శాతాన్ని పెంచుతూ, భవిష్యత్తులో పెట్రోల్ వాడకాన్ని పూర్తిగా పక్కనపెట్టి వంద శాతం ఇథనాల్ (E100 Fuel) ఇంధన వినియోగాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఇవి కూడా చదవండి
మౌలిక సదుపాయాలు, సవాళ్లు
నూతన ఇంధన విధానం అమలులో ఆటోమొబైల్ పరిశ్రమ భాగస్వామ్యం అత్యంత కీలకం. ఇప్పటికే ప్రధాన వాహన తయారీ సంస్థలు ‘ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్’ (ఫ్లెక్స్ ఫ్యూయల్) సాంకేతికతతో పనిచేసే ప్రోటోటైప్ వాహనాలను ప్రదర్శించాయి. రాబోయే రోజుల్లో ‘ఈ100’ (E100 Fuel) బ్లెండింగ్‌కు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండే వాహన మోడళ్లను వాణిజ్యపరంగా మార్కెట్లోకి తీసుకురావాల్సి ఉంది.
మరోవైపు, ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలతో (OMC) పాటు ఇతర సంస్థల సమన్వయంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ప్రధాన నగరాలు, వ్యవసాయ కేంద్రాల్లో, ప్రత్యేక ‘ఈ100’ (E100 Fuel) బంక్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే వంద శాతం ఇథనాల్‌కు వాతావరణంలోని అత్యధిక తేమను పీల్చుకునే గుణంతో పాటు, లోహాలను తుప్పు పట్టించే (Corrosive) స్వభావం ఉంటుంది. కాబట్టి ఈ ఇంధనాన్ని నిల్వ చేసే భూగర్భ ట్యాంకులు, సరఫరా చేసే పైప్లైన్ల వ్యవస్థ తుప్పు పట్టకుండా ప్రత్యేక సాంకేతికతతో రవాణా, స్టోరేజీ విభాగాల్లో కీలక మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలు
వంద శాతం బయో ఇంధన (E100 Fuel) విధానం దేశానికి రెండు విధాలుగా లబ్ధి చేకూరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పెట్రోల్ స్థానంలో ఇథనాల్‌ను వాడటం వల్ల చమురు దిగుమతుల భారం భారీగా తగ్గి, విదేశాలపై ఆధారపడే పరిస్థితి తప్పుతుంది. ఇథనాల్ తయారీకి అవసరమైన చెరుకు, మొక్కజొన్న, పాడైపోయిన వరి ధాన్యాన్ని బయో రిఫైనరీలకు బదలాయించడం ద్వారా రైతులకు స్థిరమైన, అదనపు ఆదాయం సమకూరుతుంది. వీటికి తోడు, సాంప్రదాయ ఇంధనాల స్థానంలో క్లీన్ ఆల్టర్నేటివ్గా భావించే ఇథనాల్ (E100 Fuel) వాడకం వల్ల.. వాహనాల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు గణనీయంగా తగ్గిపోయి పర్యావరణ పరిరక్షణకు, అంతర్జాతీయ వాతావరణ లక్ష్యాల సాధనకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.








