భారత ఆహార ఉత్పత్తులకు ఐరోపా బ్రేక్.. 450కి పైగా రకాలు తిరస్కరణ
భారతదేశం నుంచి యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలకు ఎగుమతి అవుతున్న ఆహార ఉత్పత్తుల నాణ్యతపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు రకాల ఉత్పత్తులలో మోతాదుకు మించి ప్రమాదకరమైన పురుగుమందుల అవశేషాలు (Pesticides), క్యాన్సర్కు దారితీసే హెవీ మెటల్స్ (భారీ లోహాలు) ఉన్నట్లు ఐరోపా (Europe) అధికారులు గుర్తించారు. ‘యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ’, ‘ఈయూ కమిషన్’ విడుదల చేసిన అధికారిక డేటా విశ్లేషణ ప్రకారం.. 2024 మే 1 నుంచి 2026 మే 30 వరకు గడిచిన రెండేళ్ల కాలంలో 450 కంటే ఎక్కువ భారతీయ ఆహార ఉత్పత్తులు ఈయూ సరిహద్దుల్లో తిరస్కరణకు గురయ్యాయి.
ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ నిజాలు..
ఐరోపా (Europe) నిపుణులు నిర్వహించిన శాస్త్రీయ నాణ్యతా పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అంతర్జాతీయ ప్రమాణాల కంటే అత్యంత హానికరమైన రసాయనాలు ఈ ఉత్పత్తులలో ఉన్నట్లు నిర్ధారణ అయింది.
రసాయనాలు, భారీ లోహాలు: మొత్తం తిరస్కరణకు గురైన వాటిలో 365 ఉత్పత్తులలో ప్రమాదకర స్థాయిల్లో పురుగుమందులు, సీసం (Lead), పాదరసం (Mercury) వంటి హెవీ మెటల్స్ ఉన్నట్లు అధికారులు తేల్చారు.
వ్యాధి కారకాలు (పాథోజెన్స్): దాదాపు 50 ఆహార ఉత్పత్తులలో మానవ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే ‘సాల్మొనెల్లా’ బాక్టీరియాతో పాటు, ఫంగస్ వల్ల ఏర్పడే ‘అఫ్లాటాక్సిన్ బీ1’ (Aflatoxin B1), ‘ఒక్రాటాక్సిన్ ఏ’ (Ochratoxin A) వంటి టాక్సిన్లు ఉన్నట్లు గుర్తించారు.
ఇవి కూడా చదవండి
పర్యావరణ కాలుష్యం: ప్యాకేజింగ్ లేదా రవాణా సమయంలో సంభవించే మినరల్ ఆయిల్ కాలుష్యం వంటి పర్యావరణ కారకాల వల్ల మరికొన్ని ఉత్పత్తులు ఐరోపా (Europe) మార్కెట్లోకి ప్రవేశించకుండా నిలిచిపోయాయి.
జాబితాలోని ప్రముఖ ఉత్పత్తులు ఇవే..
ఈయూ దేశాలు తిరస్కరించిన ఉత్పత్తులలో భారతదేశం నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యే సాంప్రదాయ ఆహార పదార్థాలే అధిక సంఖ్యలో ఉన్నాయి.
మసాలా దినుసులు, మూలికలు: అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్న భారతీయ సుగంధ ద్రవ్యాలు, ఆయుర్వేద మూలికలు.
తోటపని ఉత్పత్తులు: తాజా పండ్లు, కూరగాయలు.
డ్రై ఫ్రూట్స్, గింజలు: జీడిపప్పు, బాదం వంటి నట్స్, వాటితో తయారు చేసిన అనుబంధ ఉత్పత్తులు, వివిధ రకాల నూనె గింజలు.
ధాన్యాలు, బేకరీ: తృణధాన్యాలు, మైదాతో చేసిన బేకరీ ఉత్పత్తులు, ప్రత్యేక డైట్ (Diet) ఆహార పదార్థాలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆహార నియమాలు, సేఫ్టీ స్టాండర్డ్స్ కఠినమవడంతో భారతీయ ఎగుమతిదారులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. దేశీయంగా పంటల సాగులో విచ్చలవిడిగా పురుగుమందులు వాడటం, నిల్వ ఉంచే పరిసరాలు శుభ్రంగా లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరప్ (Europe) సహా అంతర్జాతీయ మార్కెట్లో ‘మేడ్ ఇన్ ఇండియా’ బ్రాండ్ విశ్వసనీయత దెబ్బతినకుండా ఉండాలంటే.. కేంద్ర ప్రభుత్వం, ఎగుమతి నియంత్రణ సంస్థలు తక్షణమే స్పందించి కఠిన నాణ్యత ప్రమాణాలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాణిజ్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








