యూపీఐ చెల్లింపుల్లో సరికొత్త విప్లవం.. ఖాతాలో డబ్బుల్లేకున్నా పేమెంట్
డిజిటల్ చెల్లింపుల రంగంలో రోజుకో కొత్త ఆవిష్కరణ పుట్టుకొస్తోంది. యూపీఐ (UPI) లావాదేవీలను మరింత సులభతరం చేస్తూ, సామాన్యులకు క్రెడిట్ (అప్పు) సదుపాయాన్ని మరింత చేరువ చేసే దిశగా ప్రముఖ ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ ‘భారత్‌పే’ (BharatPe) కీలక అడుగు వేసింది. దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ‘యెస్ బ్యాంక్’ (YES Bank) భాగస్వామ్యంతో ‘భారత్‌పే ఫ్లెక్స్’ (BharatPe Flex) పేరిట సరికొత్త ‘క్రెడిట్-ఆన్-యూపీఐ’ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వినూత్న సదుపాయం ద్వారా కస్టమర్లు తమ రోజువారీ యూపీఐ చెల్లింపులను ఎప్పటిలాగే కొనసాగిస్తూనే, అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డు తరహా ప్రయోజనాలను క్షణాల్లో పొందవచ్చు.
ఇవి కూడా చదవండి
క్రెడిట్ కార్డు లేకుండానే..
సాధారణంగా గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ (UPI) యాప్స్ ద్వారా చెల్లింపులు చేయాలంటే మన బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఉండటం తప్పనిసరి. కానీ ‘భారత్‌పే ఫ్లెక్స్’ ఆ నిబంధనను మారుస్తోంది. భౌతికంగా క్రెడిట్ కార్డును వాడినట్లుగానే యూపీఐ ద్వారా ముందుగా చెల్లింపులు చేసి, ఆ తర్వాత బిల్లు చెల్లించే వెసులుబాటును ఇది కల్పిస్తుంది. కిరాణా షాపులు, సూపర్మార్కెట్లలో క్యూఆర్ (QR) కోడ్ స్కాన్ చేయడం దగ్గరి నుంచి.. ఆన్లైన్ షాపింగ్, మొబైల్ రీఛార్జ్‌లు, కరెంట్ బిల్లుల చెల్లింపులు, విమాన లేదా బస్సు టికెట్ల బుకింగ్, పెట్రోల్ బంకుల్లో ఇంధన ఖర్చుల వరకు.. దాదాపు అన్ని రకాల లావాదేవీలకు ఈ ‘క్రెడిట్ లైన్’ను ఎలాంటి ఆటంకం లేకుండా వినియోగించుకోవచ్చు.
45 రోజుల వడ్డీ లేని గడువు..
బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ సున్నా ఉన్నప్పటికీ, అత్యవసర సమయాల్లో నిరంతరాయంగా చెల్లింపులు చేయడానికి ఈ (UPI) ఫీచర్ ఒక వరంగా మారనుంది.
జీరో ఇంట్రెస్ట్: ‘భారత్‌పే ఫ్లెక్స్’ ద్వారా చేసిన ఖర్చులను తిరిగి చెల్లించడానికి కస్టమర్లకు గరిష్టంగా 45 రోజుల వరకు గడువు లభిస్తుంది. ఈ వ్యవధిలోగా బిల్లు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు లేదా వడ్డీ చెల్లించాల్సిన పనిలేదు.
ఈఎంఐ సదుపాయం: ఒకవేళ 45 రోజుల తర్వాత కూడా మొత్తం బకాయిని ఒకేసారి చెల్లించడం ఆర్థికంగా భారంగా అనిపిస్తే, ఆ ఖర్చును సులభ వాయిదాలుగా (EMI) మార్చుకునే అద్భుతమైన సౌకర్యాన్ని సైతం కంపెనీ కల్పిస్తోంది.
ఉద్యోగులకు, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు నెలాఖరులో సాధారణంగా ఎదురయ్యే నగదు కొరతను అధిగమించడానికి ఈ ప్లాట్‌ఫామ్ ఎంతో ఉపయోగకరం. అలాగే అనుకోకుండా వచ్చే వైద్య ఖర్చులు లేదా ఇతర అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఈ తరహా (UPI) సేవలు భరోసానిస్తాయి. కేవలం ప్లాస్టిక్ కార్డులకే పరిమితమైన క్రెడిట్ వ్యవస్థను, దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్ యూపీఐకి అనుసంధానం చేయడం ద్వారా డిజిటల్ ఆర్థిక రంగంలో ఈ కొత్త ఆవిష్కరణ సరికొత్త ఒరవడిని సృష్టిస్తుందని బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.








