భారత్ సొంతంగా ఎదగాలి.. యాంత్రోపిక్ ఏఐ నిషేధాలపై శ్రీధర్ వేంబు
అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అమెరికా ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ‘యాంత్రోపిక్’ (Anthropic) అభివృద్ధి చేసిన అత్యంత అధునాతన ఏఐ మోడల్స్ ‘ఫేబుల్ 5’ (Fable 5), ‘మైథోస్ 5’ (Mythos 5) సేవలను విదేశీయులకు నిలిపివేస్తూ అమెరికా జాతీయ భద్రతా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంపై ప్రముఖ స్వదేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం ‘జోహో’ (Zoho) అధినేత శ్రీధర్ వేంబు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (X) వేదికగా అత్యంత కీలకమైన విశ్లేషణ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం కోసం ఇకపై ఏ దేశం కూడా ప్రపంచీకరణ, విదేశీ శక్తులపై ఆధారపడలేదనడానికి ఈ ఘటనే ఒక ‘వేక్-అప్ కాల్’ అని ఆయన అన్నారు.
టెక్నాలజీయే జాతీయ భద్రతకు ఆయుధం..
అమెరికా ప్రభుత్వం జూన్ 12న జారీ చేసిన జాతీయ భద్రతా ఆదేశాల మేరకు యాంత్రోపిక్ (Anthropic) సంస్థ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. అమెరికా లోపల లేదా బయట ఉన్న విదేశీ పౌరులతో పాటు, తమ స్వంత సంస్థలో పనిచేస్తున్న విదేశీ మూలాలున్న ఉద్యోగులకు కూడా ఈ రెండు మోడల్స్ యాక్సెస్‌ను తక్షణమే నిలిపివేసింది. ఈ వ్యూహాత్మక ఆంక్షలను ప్రస్తావిస్తూ శ్రీధర్ వేంబు భారతదేశాన్ని అప్రమత్తం చేశారు. “ప్రస్తుత ఆధునిక యుగంలో సాంకేతికత అనేది కేవలం వ్యాపార సాధనం కాదు.. అదొక అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఏదైనా ఒక దేశం యొక్క జాతీయ సార్వభౌమాధికారం, జాతీయ భద్రత అనేది ఇప్పుడు పూర్తిగా ఆ దేశం వద్ద ఉన్న సాంకేతిక స్వయంసమృద్ధిపైనే ఆధారపడి ఉన్నాయి” అని ఆయన (Sridhar Vembu) పేర్కొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ క్షణంలోనైనా నిలిపివేయవచ్చని ఈ (Anthropic) నిషేధం నిరూపించిందని, అందువల్ల ఇకపై ‘ప్రపంచీకరణ యుగం’ ముగిసిపోయినట్లేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓపెన్ సోర్స్ ఏఐ వైపు అడుగులు వేయాలి
ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశం తన భవిష్యత్తు అవసరాల కోసం సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీధర్ వేంబు పిలుపునిచ్చారు. విదేశీ ఏఐ మోడల్స్ (Anthropic) లేదా బిగ్-టెక్ సంస్థలపై గుడ్డిగా ఆధారపడటం దేశ భద్రతకే ప్రమాదకరమని హెచ్చరించారు. దీనికి ప్రత్యామ్నాయంగా.. భారత్ తన సొంత ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. పరిమాణంలో చిన్నవైనప్పటికీ, దేశీయ నియంత్రణలో ఉండేలా.. ‘ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్’ అభివృద్ధి, వినియోగంపైనే భారత్ ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు.
కేవలం ఇతరుల సాంకేతికతను వాడుకునే వినియోగదారు దేశంగా కాకుండా.. సొంతంగా (Anthropic) ఏఐ మౌలిక వసతులను, మోడళ్లను సృష్టించుకోవడం ద్వారానే భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోగలదని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ దేశాల ఆంక్షల పర్వం నేపథ్యంలో ఐటీ రంగంలో భారతదేశం ‘ఆత్మనిర్భరత’ సాధించడమే తదుపరి ఏకైక మార్గమని వేంబు చేసిన ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త టెక్నాలజీ చర్చకు దారితీసింది.








