సైబర్ మాయాజాలంపై పోలీసుల మెరుపుదాడి.. 66 మంది నేరగాళ్ల అరెస్ట్
Hyderabad: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ‘ఘోస్ట్ సిమ్’ ముఠాపై హైదరాబాద్ సైబర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. గత నెలలో ‘ఆపరేషన్ 2.0, 3.0’ పేరుతో చేపట్టిన ప్రత్యేక దాడుల్లో భాగంగా, హైదరాబాద్ పోలీసులు 13 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 66 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు నగర అదనపు పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా నిందితుల నుండి 43 మొబైల్ ఫోన్లు, 32 సిమ్ కార్డులు, 19 ల్యాప్టాపులు, అనేక బ్యాంక్ పాస్ పుస్తకాలు, చెక్ పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వివిధ రకాల మోసాలు..
మే నెలలో దేశవ్యాప్తంగా మొత్తం 74 మందిని హైదరాబాద్ సిటీ సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరు ముఖ్యంగా పెట్టుబడి మోసాలు, సోషల్ మీడియా సంబంధిత కేసులు, రుణ మోసాలు, ట్రేడింగ్ మోసాలు, మ్యాట్రిమోనియల్ మోసాలు, ఉద్యోగ మోసాలు, ఓటీపీ మోసాలు, ఏపీకే ఫైల్ మోసాలు, డేటింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ , కస్టమర్ కేర్ వంటి వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ కేసుల్లో బాధితులకు కొంత మొత్తాన్ని తిరిగి ఇప్పించేలా కూడా పోలీసులు చర్యలు చేపట్టారు.
సైబర్ పెట్రోల్ ఎన్ఫోర్స్మెంట్..
సైబర్ పెట్రోల్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా, అక్రమ కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్న 678 సోషల్ మీడియా ప్రొఫైల్స్ , 2,207 పెయిడ్ ప్రమోషనల్ అడ్వర్టైజ్మెంట్లను గుర్తించి తొలగించారు. అలాగే ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, , నకిలీ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న 304 అడ్వర్టైజ్మెంట్లను కూడా గుర్తించారు. బాధితులకు సహాయం చేయడానికి ‘సిమిత్ర’ ద్వారా 1100 కాల్స్ చేసి, ఫిర్యాదుల ఆధారంగా 253 జీవో ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు.








