నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్ష ఎలా విధిస్తారు? ఇది మనిషిని ఎలా చంపుతుంది?
Nitrogen Hypoxia: అమెరికాలోని అలబామాలో ‘నైట్రోజన్ హైపోక్సియా’ పద్ధతిలో మరణశిక్ష అమలు చేయడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది చాలా క్రూరమైన , అమానుషమైన పద్ధతి అని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. అసలు విషపూరితం కాని నైట్రోజన్ వాయువు, ఒక మనిషి ప్రాణాన్ని ఎలా తీస్తుందో వైద్య నిపుణులు వివరించారు.
నైట్రోజన్ హైపోక్సియా అంటే ఏమిటి?
సాధారణంగా మనం పీల్చే గాలిలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ , ఇతర వాయువులు ఉంటాయి. మన ఊపిరితిత్తులు ఆ గాలి నుంచి ఆక్సిజన్‌ను మాత్రమే వేరు చేసి రక్తంలోకి పంపిస్తాయి. అయితే, ఒక వ్యక్తికి ఆక్సిజన్ అందకుండా, ఊపిరితిత్తుల్లోకి పూర్తిగా 100% నైట్రోజన్‌ను మాత్రమే పంపితే, ఆక్సిజన్ స్థాయి శరీరంలో ఒక్కసారిగా పడిపోతుంది. దీనినే వైద్య పరిభాషలో ‘హైపోక్సియా’ అంటారు.
ఈ మరణశిక్ష ఎలా జరుగుతుంది?
ముందుగా ఖైదీని ఒక ప్రత్యేక స్ట్రెచర్‌పై పడుకోబెట్టి, అస్సలు కదలకుండా బలమైన పట్టీలతో కట్టివేస్తారు. ఖైదీ ముఖానికి నోరు, ముక్కు, కళ్ళు పూర్తిగా కప్పేలా ఒక ‘రెస్పిరేటర్ మాస్క్’ను బిగిస్తారు. దీనివల్ల బయట గాలి ఏమాత్రం లోపలికి రాదు. ఈ మాస్క్‌ను ఒక గొట్టం ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్ సిలిండర్‌కు కలుపుతారు. రిమోట్ ద్వారా గ్యాస్‌ను వదిలినప్పుడు, ఖైదీ మాస్క్ ద్వారా కేవలం నైట్రోజన్‌ను మాత్రమే పీల్చుకుంటాడు.
మెదడు కణాలు సెకన్ల వ్యవధిలోనే..
ఖైదీ ఊపిరితిత్తుల్లోకి కేవలం నైట్రోజన్ మాత్రమే వెళ్లడం వల్ల, అక్కడ ఉన్న కొద్దిపాటి ఆక్సిజన్ కూడా బయటకు వెళ్లిపోతుంది. ఆక్సిజన్ అందక మెదడు కణాలు సెకన్ల వ్యవధిలోనే చనిపోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల వ్యక్తి వెంటనే స్పృహ కోల్పోతాడు. మెదడు తర్వాత గుండె, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్ అందక, నిమిషాల వ్యవధిలోనే అవన్నీ పనిచేయడం ఆగిపోయి వ్యక్తి మరణిస్తాడు.
వివాదం ఎందుకు?
మాస్క్ సరిగ్గా బిగించకపోతే గాలి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల మరణం తక్షణమే సంభవించకుండా ఖైదీ తీవ్రమైన నొప్పితో, కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, ఈ పద్ధతిని అత్యంత బాధాకరమైన , క్రూరమైనదిగా పరిగణించి, పలుచోట్ల దీనిపై నిషేధం విధిస్తున్నారు.








