విజయవంతంగా ముగిసిన మాటా వర్చువల్ సీఎంఈ సదస్సు
MATA: మన అమెరికా తెలుగు సంఘం (మాటా) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన “మాటా 2వ కన్వెన్షన్ – 26” మహాసభల ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా వైద్య నిపుణుల కోసం ఒక ప్రత్యేక వర్చువల్ సీఎంఈ (కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్) సదస్సును నిర్వహించారు. జూన్ 19 నుండి జూన్ 20, 2026 వరకు గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో మాటా మహాసభలు జరగనున్న నేపథ్యంలో, ఈ ఆన్లైన్ జూమ్ కాల్ వెబినార్‌ను మే 31, 2026 ఆదివారం రోజున సాయంత్రం 7:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు (EST) విజయవంతంగా నిర్వహించారు.
నిపుణుల ప్రసంగాలు..
ఈ ఆన్లైన్ సదస్సులో వైద్య రంగంలో వస్తున్న అత్యాధునిక మార్పులు, సాంకేతికతపై ఇద్దరు ప్రముఖ అంతర్జాతీయ నిపుణులు ప్రెజెంటర్లుగా వ్యవహరించి ప్రసంగించారు. నోబెల్ ప్రైజ్ నామినీ అయిన డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి.. ‘అప్లికేషన్ ఆఫ్ ప్రోబయోటిక్స్ అండ్ దేర్ ప్రూవెన్ ఫిజియోలాజికల్ & థెరప్యూటిక్ ప్రాపర్టీస్’ అనే అంశంపై సాయంత్రం 8 నుండి 9 గంటల వరకు మాట్లాడారు. వైద్య రంగంలో డాక్టర్ వి.“బాల” బాలసుబ్రమణియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లికేషన్లు, నైతిక విలువలు , గవర్నెన్స్ అనే అంశంపై సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు ప్రసంగించారు.
ఈ సీఎంఈ సదస్సులో పాల్గొన్న వైద్య విద్యార్థులకు ఉచిత రిజిస్ట్రేషన్ కల్పించగా, ప్రొవైడర్లు, నర్సులు, ఫార్మసిస్ట్‌లకు మెంబర్స్, నాన్-మెంబర్స్ విభాగాల వారీగా నామినల్ ఫీజును నిర్ణయించారు. ఈ కోర్సు ద్వారా పాల్గొన్న వారికి 2 క్రెడిట్స్ లభించనున్నాయి. ఈ కార్యక్రమాన్ని మాటా సీఎంఈ కమిటీ ప్రతినిధులు కళ్యాణి బెల్లంకొండ, డాక్టర్ శాంతి ఒప్పనపల్లి, డాక్టర్ సంధ్య చినాల, డాక్టర్ రాజ్ కటారా లు పర్యవేక్షించారు.








