“హీమాన్ అండ్ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్” సినిమా రివ్యూ – హీ-మ్యాన్ రీ-ఎంట్రీ ప్రేక్షకులను మెప్పించిందా?
Rating: 2.5
–సూర్య ప్రకాష్ జోశ్యుల
అనగనగా…మన విశ్వానికి చాలా దూరంగా ఉన్న ఎటెర్నియా అనే గ్రహం. అక్కడో అద్భుతమైన రాజ్యం. అక్కడ మాట్లాడే జంతువులు ఉండేవి, ఆకాశంలో ఎగిరే నౌకలు కనిపించేవి, మాయా శక్తులతో నిండిన వీరులు జీవించేవారు. ఆ రాజ్యానికి యువరాజు ఆడమ్. అన్నీ బాగానే సాగుతుండగా, ఒక రోజు స్కెలెటర్ అనే భయంకరమైన దుష్టుడు ఎటెర్నియాపై దాడి చేశాడు. అతని లక్ష్యం ఒక్కటే… ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఖడ్గాన్ని సొంతం చేసుకుని విశ్వాన్నే తన గుప్పెట్లో పెట్టుకోవడం!
ప్రమాదం దగ్గరపడుతోందని గ్రహించిన రాజు, రాణి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఆ మాయా ఖడ్గాన్ని చిన్నారి ఆడమ్ చేతిలో పెట్టి, శత్రువుల కంట పడకుండా భూమికి పంపించారు. కానీ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే! భూమికి వచ్చిన ఆడమ్ ఆ ఖడ్గాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. రోజులు గడిచాయి. సంవత్సరాలు గడిచాయి. చిన్న పిల్లవాడిగా భూమికి వచ్చిన ఆడమ్ పెద్దవాడయ్యాడు. ఓక్లాహమా అనే నగరంలో సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అయితే అతని మనసు మాత్రం ఎప్పుడూ ఎటెర్నియాలోనే ఉండేది.
“మా ఊరిలో మాట్లాడే పులులు ఉంటాయి!”, “మా రాజ్యంలో ఆకాశంలో ఎగిరే యుద్ధ నౌకలు ఉంటాయి!” అని చెప్పినా, అతని మాటలు విన్నవాళ్లు నవ్వుకునేవారు. “అయ్యో ఆడమ్… మళ్లీ నీ కల్పిత కథలేనా?” అని ఆటపట్టించేవారు.
కానీ ఒక రోజు అదృష్టం తలుపు తట్టింది. ఎన్నేళ్ల క్రితం పోయిన ఆ ఖడ్గం ఆచూకీ అతనికి దొరికింది. దాన్ని వెతుకుతూ వెళ్లిన ఆడమ్‌కు మరో ఆశ్చర్యం ఎదురైంది. చిన్నప్పుడు తనతో కలిసి పెరిగిన స్నేహితురాలు తీలా అకస్మాత్తుగా అతని ముందుకొచ్చింది! ఆమె సహాయంతో ఆడమ్ మళ్లీ ఎటెర్నియాకు చేరుకున్నాడు.
కానీ అక్కడ చూసిన దృశ్యం అతని గుండెను పిండేసింది. ఒకప్పుడు వెలుగులతో మెరిసిన రాజ్యం ఇప్పుడు శిథిలాలుగా మారిపోయింది. అతని తల్లిదండ్రులు, ప్రజలు స్కెలెటర్ చెరలో బందీలయ్యారు. అప్పుడు ఆడమ్ తన చేతిలోకి తిరిగి వచ్చిన ఆ మాయా ఖడ్గాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అంతే… అతనిలో దాగి ఉన్న అద్భుత శక్తి ఒక్కసారిగా మేల్కొంది! సాధారణ యువరాజు ఆడమ్… మహా వీరుడు హీ-మ్యాన్ గా మారిపోయాడు! ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
స్నేహితుల సహాయంతో హీ-మ్యాన్ స్కెలెటర్ను ఎదుర్కొన్నాడు. తన కుటుంబాన్ని రక్షించాడు. తన రాజ్యాన్ని తిరిగి గెలుచుకున్నాడు. చీకటి మీద వెలుగు గెలిచింది. భయం మీద ధైర్యం గెలిచింది.అయితే అదంతా ఎలా జరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే మరి.
ఎనాలిసిస్…
90ల పిల్లలకు హీ-మ్యాన్ అంటే కేవలం ఓ కార్టూన్ క్యారెక్టర్ కాదు. బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, స్పైడర్మ్యాన్లతో సమానంగా గుర్తుండిపోయే బాల్య జ్ఞాపకం. అందుకే He-Man and the Masters of the Universe లైవ్ యాక్షన్ రూపంలో వస్తోందని ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా నేటి అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో ఎటెర్నియా ప్రపంచాన్ని ఎలా చూపిస్తారో అనే ఆసక్తి అందరిలోనూ కనిపించింది.
కానీ సినిమా చూసిన తర్వాత కలిగే మొదటి ఫీలింగ్ ఒక్కటే. “ఇంత గొప్ప యూనినర్స్ చేతిలో ఉండి, ఇంత మామూలు కథ ఎలా రాశారు?” అని. ఎందుకంటే సినిమాలో ఎటెర్నియా ఉంది… కానీ మ్యాజిక్ లేదు! విజువల్‌గా చూస్తే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం కనిపిస్తుంది. భారీ కోటలు, వింత జీవులు, శక్తివంతమైన ఆయుధాలు, అంతరిక్ష యుద్ధాల నేపథ్యం అన్నీ ఉన్నాయి. కానీ మంచి ఫాంటసీ ప్రపంచం అంటే కేవలం గ్రాఫిక్స్ కాదు. అది నిజంగా జీవిస్తున్న ప్రపంచంలా అనిపించాలి. ఇక్కడ అదే మిస్ అయింది. ఎటెర్నియా అందంగా కనిపిస్తుంది. కానీ జీవంగా అనిపించదు.
ఇక స్క్రీన్‌ప్లే చూస్తే…హీ-మ్యాన్‌లో చాలా జరుగుతాయి. రాజ్యం నాశనం అవుతుంది. హీరో భూమికి వస్తాడు. మాయా ఖడ్గం పోతుంది. విలన్ ప్రపంచాన్ని ఆక్రమించాలని చూస్తాడు. హీరో తిరిగి వచ్చి యుద్ధం చేస్తాడు. అన్నీ జరుగుతాయి. కానీ ప్రేక్షకుడు ఎందుకు పట్టించుకోవాలి?సినిమా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోతుంది.ఎందుకంటే మనని ఆ ప్రపంచంలో పూర్తిగా లీనం అయ్యే అవకాసం ఇవ్వరు.
అవతార్ స్కేల్… టీవీ సీరియల్ ఎమోషన్
ఈ సినిమా ప్రధాన సమస్య భారీ నిర్మాణం కాదు. ఎమోషన్ సమస్య. ఆడమ్ తన కుటుంబాన్ని కోల్పోతాడు.తన రాజ్యాన్ని కోల్పోతాడు. తన వారసత్వాన్ని కోల్పోతాడు. కానీ ప్రేక్షకుడు ఆ బాధను ఫీల్ అయ్యేంత సమయం స్క్రిప్ట్ ఇవ్వదు. అన్నీ చాలా తొందరగా జరిగిపోతాయి. ఒక సీన్ ముగియకముందే మరో సీన్ మొదలవుతుంది.
ఫలితం?
కథ ముందుకు వెళ్తుంది. భావోద్వేగాలు వెనుకే ఉండిపోతాయి. మార్వెల్ ఫార్ములా… కానీ మార్వెల్ మ్యాజిక్ లేదు.ఈ సినిమాను చూస్తుంటే పాత MCU సినిమాల కలిపిన వంటకంలా అనిపిస్తుంది. కొంచెం Superman. కొంచెం Thor. కొంచెం Thor Ragnarok. దానికి తోడు డ్రామా బలహీనంగా ఉండటంతో డైలాగ్ కామెడీ కూడా పెద్దగా పనిచేయలేదు. అలాగే విలన్ బలహీనంగా ఉండటంతో హీరో సక్సెక్ కూడా అంత గొప్పగా అనిపించదు.
ఫైనల్ థాట్
హీ-మ్యాన్‌లో ఊహించినంత మాయ లేదు. ఊహించినంత సాహసం లేదు. ఊహించినంత గొప్ప రచన అసలే లేదు. అలాగని పూర్తిగా నిరాశపరిచే సినిమా కూడా కాదు. పిల్లలు ఎంజాయ్ చేసే విజువల్స్ ఉన్నాయి. నికోలస్ గాలిట్జైన్ ప్రెజెన్స్ బాగుంది. కానీ పెద్దలు, ముఖ్యంగా 90ల హీ-మ్యాన్ అభిమానులు ఆశించే భావోద్వేగ బరువు, అద్భుతమైన స్క్రీన్‌ప్లే, మరపురాని విలన్ మాత్రం కనిపించవు.పిల్లలకు ఇది ఒక రంగురంగుల అడ్వెంచర్. 90ల హీ-మ్యాన్ అభిమానులకు ఇది ఒక నోస్టాల్జియా ట్రిప్. కానీ ఒక గొప్ప ఫాంటసీ అనుభవం కోసం ఎదురుచూసిన వారికి మాత్రం ఇది పూర్తిగా తృప్తినివ్వదు. చివరికి… “By the Power of Grayskull!” అని హీ-మ్యాన్ గట్టిగా అరిచినా, ఆ శక్తి ప్రేక్షకుల హృదయాల్లోకి పూర్తిగా చేరలేదు.
కళ్లను ఆకట్టుకునే ప్రపంచం ఉంది… కానీ మనసును గెలిచే కథ మాత్రం లేదు.








