పర్సనల్ లోన్‌తో బంగారం కొనొచ్చా? ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..
Personal Loan: బంగారం ధరలు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, సామాన్య , మధ్యతరగతి కుటుంబాలకు వీటిని కొనుగోలు చేయడం ఇప్పటికీ ఆర్థిక భారంగానే ఉంది. మన దేశంలో శుభకార్యాలు, పెళ్లిళ్ల వంటి వేడుకల్లో బంగారాన్ని కొనుగోలు చేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ అవసరాల కోసం కొందరు బ్యాంకుల నుండి పర్సనల్ లోన్లు తీసుకోవడం వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఇలా రుణం తీసుకుని బంగారం కొనడం ఎంతవరకు సరైనదో ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు.
నిపుణుల సలహా..
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, పర్సనల్ లోన్ తీసుకుని బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం మంచి నిర్ణయం కాదు. ఒకవేళ పెళ్లిళ్లు లేదా అత్యవసర కుటుంబ అవసరాల వంటి అనివార్య పరిస్థితుల్లో అయితే, రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు పరిమిత మొత్తంలో రుణం తీసుకోవడం గురించి ఆలోచించవచ్చు. అయితే, అధిక మొత్తంలో రుణం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులు పర్సనల్ లోన్లపై 15 శాతం నుండి 25 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి, దీనివల్ల నెలవారీ ఈఎంఐలు పెరిగి కుటుంబ బడ్జెట్‌పై అదనపు భారం పడుతుంది.
పెట్టుబడి కోసం బంగారం కొనడం..
భవిష్యత్తులో లాభాలు వస్తాయనే ఆశతో రుణం తీసుకుని పెట్టుబడి కోసం బంగారాన్ని కొనడం సరైన పద్ధతి కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే బంగారం ధరలు పెరిగి వచ్చే లాభాల కంటే, రుణంపై మీరు చెల్లించే వడ్డీ ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పెట్టుబడి లక్ష్యంతో బంగారాన్ని ఎంచుకునే వారు, ఆభరణాల రూపంలో కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను ఆలోచించడం ఉత్తమం.
ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
గోల్డ్ ఈటీఎఫ్‌లు (Gold ETFs): వీటిలో పెట్టుబడి పెట్టడం షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లే ఉంటుంది , ఇందులో బంగారం విలువ ఆధారంగా పెట్టుబడి అవకాశం లభిస్తుంది. ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో ఉండే మేకింగ్ ఛార్జీలు, తరుగు నష్టం, మజూరీ వంటి అదనపు ఖర్చులు ఇందులో ఉండవు.
డిజిటల్ గోల్డ్: డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా కేవలం ఒక రూపాయి నుంచే పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఇది నిల్వ చేయడం , భద్రత పరంగా కూడా సౌకర్యవంతమైన ఎంపికగా నిలుస్తుంది.








