ఐటీ శాఖ కొత్త గైడ్‌లైన్స్.. ఎగవేతదారులే లక్ష్యంగా నోటీసులు
ఆదాయపు పన్ను శాఖ (ఐటీ విభాగం) పన్ను ఎగవేతదారులకు (Tax Evasions) అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ రిటర్నులను లోతుగా పరిశీలించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజాగా కొత్త మార్గదర్శకాలను (గైడ్‌లైన్స్) జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 26.97 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను సాధించడమే ఐటీ శాఖ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ టార్గెట్‌ను అందుకోవడంతో పాటు, లూప్‌హోల్స్‌ను ఉపయోగించుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిని పట్టుకునేందుకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించింది.
చట్టపరమైన నిబంధనల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన ఐటీ రిటర్నులను (ITR) పరిశీలించేందుకు సంబంధిత పన్ను చెల్లింపుదారులకు (Tax Evasions) నోటీసులు పంపడానికి జూన్ 30ని ఆఖరి గడువుగా ఐటీ శాఖ నిర్ణయించింది. ఈ గడువు లోపు పన్ను ఎగవేత అనుమానాలు ఉన్న ఖాతాలను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేయనున్నారు. ముఖ్యంగా గతంలో కార్యాలయాలు, నివాసాలపై సోదాలు (ఐటీ రైడ్స్) జరిగిన కేసులు, పన్ను ఎగవేతకు పాల్పడినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి పక్కా సమాచారం ఉన్న అకౌంట్లను ఈసారి తప్పనిసరిగా లోతైన విచారణకు స్వీకరిస్తారు.
పాత కేసులపై ప్రత్యేక నిఘా
ఈసారి ఐటీ శాఖ నిఘా కేవలం వ్యక్తిగత, కార్పొరేట్ అకౌంట్లకే పరిమితం కాలేదు. చట్టవిరుద్ధంగా పన్ను మినహాయింపులు (Tax Evasions) పొందుతున్న సంస్థలపై కఠినంగా వ్యవహరించనుంది. 2025 మార్చి 31 నాటికి అధికారిక రిజిస్ట్రేషన్ రద్దయినప్పటికీ.. నిబంధనలకు విరుద్ధంగా ట్యాక్స్ మినహాయింపులు క్లెయిమ్ చేసిన ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థల (ఎన్జీఓలు) అకౌంట్లను ఈ విడత తప్పనిసరిగా స్క్రూటినీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
దీనితో పాటు, గతంలో తప్పుడు లెక్కలు చూపడం లేదా ఆదాయాన్ని దాచడం వల్ల అదనంగా పన్ను పడిన పాత కేసులను కూడా ఐటీ శాఖ మళ్లీ తిరగదోడనుంది. ఇలాంటి పెండింగ్ లేదా పాత కేసుల (Tax Evasions) విలువ హైదరాబాద్, ముంబై వంటి మెట్రో నగరాల్లో రూ. 50 లక్షలు దాటితే, అలాగే ఇతర చిన్న నగరాల్లో రూ. 20 లక్షలు దాటిన పక్షంలో వాటిని పునర్విచారణ పరిధిలోకి తీసుకువస్తారు.
చిన్న తప్పులకు నోటీసులు ఉండవు
ఈ కొత్త నిబంధనల వల్ల ప్రతి ఏటా సకాలంలో, పద్ధతిగా ఆదాయపు పన్ను కట్టే సామాన్య, మధ్యతరగతి ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు ఎలాంటి టెన్షన్ ఉండదని అధికారులు చెప్పారు. కంప్యూటర్ సిస్టమ్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాఫ్ట్వేర్ పట్టుకునే చిన్న చిన్న సాంకేతిక తప్పులు, వ్యత్యాసాలను చూసి (Tax Evasions) ఐటీ శాఖ నేరుగా లోతైన విచారణకు తీసుకోదు. పన్ను ఎగవేసినట్లు పక్కా ఆధారాలు, డాక్యుమెంట్లు ఉంటేనే నోటీసులు పంపుతారు.
నిజాయితీగా ఉండే ట్యాక్స్ పేయర్లను ఇబ్బంది పెట్టకుండా, కేవలం భారీ మోసాలకు (Tax Evasions) పాల్పడేవారిని మాత్రమే పట్టుకోవాలన్నదే ఐటీ శాఖ అసలు ప్లాన్. అయితే విదేశీ లావాదేవీలు చేసే పెద్ద కంపెనీలు, అంతర్జాతీయ బదిలీలు (ట్రాన్స్ఫర్ ప్రైసింగ్) జరిపే కార్పొరేట్ సంస్థలు, అలాగే భారీగా పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్న వారిని మాత్రం అధికారులు నేరుగా విచారిస్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో పెద్ద ఎత్తున బిజినెస్ లావాదేవీలు నిర్వహించే వ్యాపారవేత్తలు తమ బిల్లులు, లెక్కలను పక్కాగా ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని ఆర్థిక రంగ విశ్లేషకులు చెప్తున్నారు.








