గ్రేట్ నికోబార్‌లో రూ.13,000 కోట్లతో భారీ విమానాశ్రయం
హిందూ మహాసముద్ర ప్రాంతంలో (IOR) ఆధిపత్యమే లక్ష్యంగా పావులు కదుపుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం వ్యూహాత్మక అడుగు వేసింది. దేశ రక్షణలో అత్యంత కీలకమైన అండమాన్ నికోబార్ దీవుల్లో సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రేట్ నికోబార్ (Great Nicobar) దీవిలో దాదాపు రూ. 13,000 కోట్ల అంచనా వ్యయంతో సరికొత్త ‘గ్రీన్‌ఫీల్డ్ సివిల్-మిలిటరీ విమానాశ్రయాన్ని’ నిర్మించేందుకు పచ్చజెండా ఊపింది. వాస్తవానికి అక్కడ ఉన్న ప్రస్తుత నౌకాదళ ఎయిర్‌ఫీల్డ్ ‘ఐఎన్ఎస్ బాజ్’ (INS Baaz) రన్‌వేను విస్తరించాలని మొదట భావించినప్పటికీ, కేంద్రం ఆ ప్రతిపాదనను విరమించుకుని గలాథియా బే సమీపంలోని ‘చింగెన్’ ప్రాంతంలో పూర్తి స్థాయి నూతన విమానాశ్రయ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది.
ప్రత్యామ్నాయం ఎందుకు?
ఐఎన్ఎస్ బాజ్ ఎయిర్‌ఫీల్డ్ విస్తరణ చేపడితే దట్టమైన అడవులు నాశనమవడంతో పాటు అరుదైన వన్యప్రాణులు, స్థానిక గిరిజనుల ఆవాసాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని పర్యావరణ అధ్యయనాలు హెచ్చరించాయి. దీంతో కేంద్రం ఈ ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంచుకుంది. వచ్చే ఐదేళ్లలో ఈ (Great Nicobar) విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇండియన్ నేవీ నియంత్రణలో పనిచేసే ఈ ప్రాజెక్టు అటు సైనిక ఆపరేషన్లకు, ఇటు పౌర విమానయాన (సివిల్ ఏవియేషన్) సేవలకు కేంద్రంగా మారనుంది.
వ్యూహాత్మక ప్రాధాన్యత..
అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి జీవనాడి లాంటి ‘మలక్కా జలసంధి’కి అత్యంత సమీపంలో ఈ (Great Nicobar) ఎయిర్పోర్ట్ రాబోతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా నౌకాదళ కదలికలపై నిరంతర నిఘా ఉంచేందుకు, భారత సముద్ర రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ విమానాశ్రయం అత్యంత కీలకంగా మారనుంది. అంతేకాకుండా గ్లోబల్ మారిటైమ్ ట్రేడ్‌లో (సముద్ర వాణిజ్యం) భారత్ వాటాను పెంచేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని రక్షణ, విదేశాంగ శాఖల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
మెగా ప్రాజెక్టుపై రాజకీయ దుమారం..
ఒకవైపు వ్యూహాత్మకంగా ఈ విమానాశ్రయం అనివార్యమని రక్షణ వర్గాలు భావిస్తుండగా.. మరోవైపు రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. గ్రేట్ నికోబార్ (Great Nicobar) అభివృద్ధి పేరుతో రూ. 81,000 కోట్లతో కేంద్రం చేపడుతున్న ఈ మొత్తం ‘మెగా డెవలప్మెంట్ ప్రాజెక్టు’పై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఇటీవల ఈ దీవుల్లో పర్యటించిన ఆయన.. అభివృద్ధి ముసుగులో ప్రకృతి వినాశనం జరుగుతోందని ఆరోపించారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏకంగా కోటిన్నరకు పైగా చెట్లను నరికివేస్తున్నారని, సముద్ర గర్భంలోని అత్యంత సున్నితమైన పగడపు దిబ్బలు (Coral reefs) నాశనమవుతున్నాయని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటికీ మించి, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న అరుదైన ‘షోంపెన్’ (Shompen) గిరిజన తెగ ఉనికికే ఈ ప్రాజెక్టు వల్ల ముప్పు వాటిల్లుతోందని విమర్శించారు. దేశ అత్యుత్తమ సహజ, పర్యావరణ వారసత్వాన్ని బలిపెడుతూ సాగుతున్న ఈ (Great Nicobar) ప్రాజెక్టు ఒక భారీ స్కామ్ అని ఆయన అభివర్ణించారు. దేశ రక్షణ ప్రయోజనాలకు, పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యతను సాధించడంలో ప్రభుత్వం ముందున్న సవాళ్లను ఈ వివాదం ఎత్తిచూపుతోంది.








