తిరుపతి కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభలో మంత్రి నారా లోకేష్
తిరుపతి: రాయలసీమను రాయల్ సీమగా మార్చడమే ఎన్డీయే లక్ష్యం. లక్షకోట్లతో చేపట్టబోయే మిషన్ రాయలసీమ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కాబోతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రాయల్ ఎన్ ఫీల్డ్, క్యారియర్, ఎల్ జీ, రిలయన్స్ సీమకే వచ్చాయి. ఇది రాయలసీమపై మాకు ఉన్న నిబద్ధత. టీడీపీ, జనసేన, బీజేపీ… మనది పెద్ద కుటుంబం. రాష్ట్రం కోసం, ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి. ఇగోలు వద్దు, ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కూటమి ధర్మాన్ని అందరూ పాటించాలి. అహంకారం వద్దు…అహంకారం వల్లే వాళ్లకి 151 – 11 అయ్యాయి. ప్రజల్లోకి చేసిన, చేస్తున్న మంచి పనులు చెబుతామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ప్రజాప్రభుత్వంలో ప్రశాంతంగా జనం
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజాప్రభుత్వం రెండేళ్ళు పూర్తిచేసుకుంది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు ప్రశాంతత వచ్చింది. దాడులు లేవు, జేసీబీలు, కబ్జాలు, హత్యలు, బెదిరింపులు, బూతులు కూడా లేవు. రాష్ట్రంలో ఉన్నది ఒక్కటే ప్రశాంతత. ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది…ప్రశాంతంగా ఉన్నారు. తిరుపతి వచ్చిన తరువాత నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే చంద్రగిరి గడ్డపై నేను ఒక మాట చెప్పాను. వెంకన్న చాలా పవర్ ఫుల్…అయనతో పెట్టుకోవద్దు… మాడి మసై పోతావు అని జగన్ కి చెప్పాను. ఆయనకి అర్దం కాలేదు..డైరెక్ట్ గా స్వామితోనే పెట్టుకున్నారు. 2024లో ఏం జరిగిందో మీరంతా చూశారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి సీమ అంటే ప్రేమ. రాయలసీమకు కరువు వస్తే జోలె పట్టి ప్రజలను ఆదుకుంది ఎన్టీఆర్. తెలుగు గంగ, గాలేరు – నగరి ప్రాజెక్ట్స్ రూపకల్పన చేసింది ఎన్టీఆర్. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, ₹50 హార్స్ పవర్ విద్యుత్, తిరుమలలో నిత్య అన్నదానం ప్రారంభించింది ఎన్టీఆర్.
రాజకీయాల్లో విరాట్ కోహ్లీ సీబీఎన్
రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన సీబీఎన్. అవతల వైపు బౌలర్లు మారతారు తప్ప ఇటు వైపు ఒకే ఒక్క బ్యాట్స్మన్ సీబీఎన్. అటువైపు బౌలర్ ఎవరైనా ఇటు సూపర్ సిక్స్ కొట్టేది మాత్రం మన సీబీఎన్. రాయలసీమను రాయల్ సీమగా మార్చేసింది మన సీబీఎన్. అప్పుడు కియా…ఇప్పుడు రాయల్ ఎన్ ఫీల్డ్. డ్రిప్ ఇరిగేషన్ తో సీమలో బంగారం పండేలా చేసింది మన సీబీఎన్. హంద్రీ – నీవా సుజల స్రవంతి ద్వారా కుప్పానికి నీళ్లు ఇచ్చింది మన సీబీఎన్.
పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చింది మన సీబీఎన్. ఇప్పుడు లక్షకోట్లతో మిషన్ రాయలసీమ స్టార్ట్ చేస్తుంది మన సీబీఎన్.
ప్రజలే వారిని రఫ్పాడిస్తారు…
2019 నుండి 2024 వరకు గొడ్డలి పార్టీ అరాచక పరిపాలన మనం చూశాం. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ పై పెట్రోలు పోసి చంపేశారు. దళిత వైద్యుడు సుధాకర్ గారిని పిచ్చోడని ముద్ర వేసి చంపేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసి డోర్ డెలివరీ చేశారు. అబ్దుల్ సలామ్ కుటుంబంతో సామూహికంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారు. కుటుంబాన్ని విడిచి మిస్బా ఆత్మహత్య చేసుకునేలా చేశారు. టీడీపీ జెండా లేకుండా చేస్తాం అన్నారు, ప్రజలే వాళ్ల జెండా పీకేశారు. వై నాట్ 175 అన్నారు. ప్రజాలు టీమ్ 11 ఇచ్చారు. వాళ్లు సిద్ధం అంటే…ప్రజలు యుద్ధం అన్నారు. మమ్మల్ని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వం అన్నారు, ప్రజలే వాళ్లని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేశారు. ఇప్పుడు రప్పా రప్పా అంటున్నారు – ప్రజలే రఫ్పాడిస్తారు.
రెండేళ్లుగా సుపరిపాలన అందించాం
ప్రజా ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో సుపరిపాలన అందించాం. అన్నీ చేసేశామని కాలర్ ఎగరేయడం లేదు. ఆర్థిక ఇబ్బందులున్నా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రూ.2వేల పెన్షన్ ఒకేసారి రూ.4వేలకు పెంచాం. అన్నా క్యాంటీన్లు, డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ, 6వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, ఇప్పుడు జాబ్ క్యాలండర్ ద్వారా 10,060 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. అదేవిధంగా చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించాం. ఆటోవాలా సేవలో, మత్స్యకార సేవలో, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి ఉచిత బస్సు, దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలండర్ల అందజేత, ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం వంటివి అమలు చేస్తూ జనరంజక పాలన అందిస్తున్నాం.
జగన్ పేరులో జీ అంటే గొడ్డలి!
ప్రజా ప్రభుత్వ నినాదం ఒక్కటే. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. దేశంలోకి వచ్చిన ప్రతివందలో 25శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కే వచ్చాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి బడా సంస్థలు ఉత్తరాంధ్రకు క్యూ కట్టాయి. రాజధాని ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతమవుతోంది. రాయలసీమకు ఎవరూ ఊహించని విధంగా ఫైటర్ జెట్స్ పరిశ్రమను, రాయల్ ఎన్ ఫీల్డ్ ను రప్పించాం. మనది గూగుల్… వాళ్లది గొడ్డలి. మనది ఫైటర్ జెట్స్… వాళ్లది ఫ్యాక్షన్. మనది కియా… వాళ్లది కిడ్నాప్. మనది విశ్వసనీయత… వాళ్లది నేరం. మనది అభివృద్ధి… వాళ్లది విధ్వంసం. మనది బుల్లెట్… వాళ్లవి బూతులు… మనది మహిళలకు 33% రిజర్వేషన్ … వాళ్లది సొంత తల్లిని, చెల్లిని గెంటేయడం. జగన్ అనే పేరులో ఉన్న జీ ని జెన్ జీ అనుకుంటున్నాడు. కానీ జగన్ లో ఉన్న జీ అంటే గొడ్డలి.
ఆయనకు సీసీడీ జబ్బు ఉంది
జగన్ కి సీసీడీ అనే జబ్బు ఉంది. సీసీడీ అంటే క్రెడిట్ చోరీ డిజార్డర్. మేము కష్టపడి గూగుల్ తీసుకువస్తే… ప్రెస్ మీట్ పెట్టి వాళ్ల వల్లనే గూగుల్ వచ్చింది అని అన్నారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది అని పేపర్ లో వస్తే.. రావడం లేదు అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దాని భూమి పూజ తర్వాత నేనే తెచ్చాను అని ప్రెస్ మీట్ పెట్టి మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఇంకా కొంచెం టైమ్ ఇస్తే ఆగస్ట్ 15న ప్రెస్ మీట్ పెట్టి భారత దేశానికి స్వతంత్రం తెచ్చింది మా తాత అని ప్రకటిస్తాడు సీసీడీ జగన్. జగన్ తెచ్చిన కంపెనీలు కొన్ని ఉన్నాయి, అవి ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్.
అపట్లో టీచర్లు కొట్టారనే జగన్ కు కోపం
చిన్నపుడు 10వ తరగతి పేపర్ లీక్ లో దొరికితే వాళ్ల టీచర్లు జగన్ ను చితగ్గొట్టారు. అందుకే జగన్ కి టీచర్స్ అంటే కోపం. ఉపాధ్యాయులను మద్యం దుకాణాలు ముందు నిలబెట్టిన చరిత్ర జగన్ ది. మెగా డీఎస్సీ ని అడ్డుకోడానికి 226 కేసులు వేశారు. 150 రోజుల్లో మనం మెగా డీఎస్సీ నిర్వహించి 16,347 పోస్టులు భర్తీచేశాం. ఇందులో ఏదో జరిగిందని బురద జల్లుతున్నారు. ఈ విషయంలో జగన్ నన్ను, సీబీఎన్ గారిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్లను ప్రశ్నిస్తున్నారు. జగన్ మీరు ఎన్ని జన్మలు ఎత్తినా డీఎస్సీని ఆపలేరు. నేను పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాను. జగన్ కి కనీసం దేశం భక్తి కూడా లేదు. మేము సాగర్ డిఫెన్స్ కంపెనీ తీసుకొస్తే దాని మీద కూడా నకిలీ ప్రచారం చేశారు. సాగర్ రక్షణ సంస్థ దేశ రక్షణ కోసం బోట్లు తయారు చేస్తుంది. కనీసం 1000 మంది మత్స్యకార పిల్లలకు ఉద్యోగాలు కల్పించేందుకు సాగర్ సంస్థను మేము తీసుకొని వస్తే అనేక ఆరోపణలు చేసి ఆ కంపెనీని కూడా తరిమేయాలని ప్రయత్నించారు.
స్టీల్ ప్లాంట్ ను కాపాడిన చరిత్ర ఎన్డీయేది
ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంటే రెండుసార్లు కాపాడిన చరిత్ర ఎన్డీయేది. స్టీల్ ప్లాంట్ క్లోజ్ చేసి అక్కడ రాజధాని కడదామనే ఆలోచన మీది. మొన్న స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. కొంత మంది కార్మికులు చనిపోయారు. చనిపోయిన పర్మినెంట్ ఉద్యోగి కుటుంబానికి ప్రజా ప్రభుత్వం రూ.2కోట్లు ఇస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి ఒకకోటి ఇస్తుంది. అంతే కాకుండా పర్మినెంట్ జాబ్ కుడా మేము ఇస్తున్నాము. ఎవరైనా ఎక్కువ ఇవ్వమని అడగొచ్చు. కానీ, జగన్ కోటి ఇవ్వమని డిమాండ్ చేశారు.
నమో వల్లే మనకు గౌరవం
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మనకి గౌరవం దక్కుతుంది. ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూస్తుంది. దానికి కారణం మన గౌరవ ప్రధాని నమో…నరేంద్ర మోదీ గారు. ఆయన రికార్డ్స్ బద్దలు కొట్టడం ఎవరి వల్లా సాధ్యంకాదు. దేశం మొత్తం నమో అంటే నరేంద్ర మోడీ. ఏపీలో మాత్రం నమో అంటే నాయుడుజీ, మోడీజీ. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరానికి నిధులు, ఫైటర్ జెట్, AMCA ప్రాజెక్ట్ వచ్చాయి. త్వరలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ ని డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ తీసుకురాబోతోందని మంత్రి లోకేష్ చెప్పారు.








