ఊబకాయం తల్లుల నుంచి కుమార్తెలకు సంక్రమిస్తుందా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!
Obesity: సాధారణంగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్య కారణాల వల్ల ఊబకాయం (ఒబేసిటీ) వస్తుందని మనకు తెలుసు. అయితే, ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ & మెటబాలిజం’లో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. ఊబకాయం సమస్య తల్లుల నుంచి కేవలం కుమార్తెలకు మాత్రమే సంక్రమిస్తుందని, కుమారులకు దీని ప్రభావం ఉండదని ఈ పరిశోధన పేర్కొంది.
సుమారు 20% మంది పిల్లలు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒబేసిటీ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. అమెరికాలో సగం మంది పెద్దలు, సుమారు 20% మంది పిల్లలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల డయాబెటిస్, అధిక రక్తపోటు (హై బిపి) , గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తల్లుల శరీర స్థితి ప్రభావం..
యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ పరిశోధకులు 9 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న 240 మంది పిల్లలు , వారి తల్లిదండ్రులపై ఈ అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో తేలిందేమిటంటే, అధిక బరువు ఉన్న తల్లులకు జన్మించిన అమ్మాయిలలో కొలెస్ట్రాల్ , బాడీ మాస్ ఇండెక్స్ (BMI) స్థాయిలు కూడా వారి తల్లులతో సమానంగా ఉంటున్నాయి. అంటే, తల్లుల శరీర స్థితి ప్రభావం కుమార్తెలపై స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, అబ్బాయిల విషయంలో తల్లుల నుండి ఇలాంటి ప్రభావం ఏదీ కనిపించలేదని పరిశోధకులు స్పష్టం చేశారు.








