వీరిలో పెరుగుతున్న మతిమరుపు ముప్పు.. ఐసీఎంఆర్ షాకింగ్ రీసెర్చ్
ICMR: మారుతున్న జీవనశైలితో పాటు శరీరంలో సూక్ష్మ పోషకాల లోపం (Micronutrient Deficiency) కారణంగా మధ్య వయస్కులు, వృద్ధులలో మతిమరుపు (డిమెంషియా) వచ్చే ముప్పు గణనీయంగా పెరుగుతోందని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) – జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియా’లో ప్రచురితమయ్యాయి.
మధ్య వయస్కులు, వృద్ధులపై ఈ అధ్యయనం..
పరిశోధకులు తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన 570 మంది మధ్య వయస్కులు, వృద్ధులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ‘మాంట్రియల్ కాగ్నిటివ్ అసెస్మెంట్’ (MoCA) సాధనం ద్వారా వారి మేధో సామర్థ్యాన్ని, అలాగే రక్తంలో విటమిన్ల శాతాన్ని పరీక్షించారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది భవిష్యత్తులో తీవ్రమైన మతిమరుపు బారిన పడే అత్యధిక ముప్పు (హై రిస్క్) లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముప్పు పొంచి ఉన్న వారిలో ప్రధానంగా విటమిన్ డి, బి2, బి6, బి12 లోపాలు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంత ప్రజల్లోనే ఈ విటమిన్ల లోపాలు అధికంగా ఉన్నట్లు స్పష్టమైంది.
సూక్ష్మ పోషకాలపై అవగాహన పెంచడం..
ఈ రీసెర్చ్‌పై ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ లీడ్ ఇన్వెస్టిగేటర్, సైంటిస్ట్ ‘జి’ డాక్టర్ జె. భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. 2050 నాటికి డిమెంషియా బాధితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ ముప్పును పెంచే పోషకాహార లోపాలను సరైన ఆహార నియమాలతో ముందే అడ్డుకోవచ్చని తెలిపారు. ప్రజల్లో సూక్ష్మ పోషకాలపై అవగాహన పెంచడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చని సూచించారు.
పోషకాహారమే రక్షణ కవచం..
ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి మాట్లాడుతూ.. భవిష్యత్తులో చేపట్టే డిమెంషియా నివారణ వ్యూహాల్లో పోషకాహార లోపాల సవరణను ఒక ప్రధాన భాగంగా చేర్చాలని అభిప్రాయపడ్డారు. నిత్యం ఉత్తమ పోషకాహారం తీసుకోవడమే మతిమరుపు రాకుండా రక్షణ కవచంగా పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు.








