స్పోర్ట్స్ డ్రామాగా రామ్ చరణ్ ‘పెద్ది’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5
నిర్మాణ సంస్థ :వృద్ధి సినిమాస్
నటీనటులు: రాంచరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు,
ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి, శృతిహాసన్, రవికిషన్ తదితరులు
ప్రొడక్షన్ డిజైనర్: కోల్లా అవినాష్
సంగీతం: ఏఆర్ రెహ్మాన్, సినిమాటోగ్రఫి: ఆర్ రత్నవేలు
ఎడిటింగ్: నవీన్ నూలి, ఆంటోని రుబెన్
క్యాస్టూమ్ డిజైనర్: దీపాలీ నూర్, స్టంట్స్: సుప్రీం సుందర్
ఆర్ట్: డేవిడ్ కుమార్ బపన్నపల్లి
నిర్మాత : వెంకట సతీష్ కిలారు
దర్శకత్వం: బుచ్చిబాబు సనా
విడుదల తేదీ : 04.06.2026
నిడివి : 3 ఘంటల 09 నిముషాలు
రామ్ చరణ్ (Ram Charan)కెరీర్ లో టాప్ మూవీ అంటే రెండో ఆలోచన లేకుండా టక్కున చెప్పే సినిమా అంటే ‘రంగస్థలం’. ఆ సినిమాతోనే రామ్ చరణ్.. తనలోని పరిపూర్ణ నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అప్పటి వరకూ తనపై ఉన్న విమర్శలకు చిట్టిబాబు పాత్రతో చెక్ పెట్టారు. రంగస్థలం వరకూ రామ్ చరణ్ అంటే.. చిరంజీవి కొడుకుగా మాత్రమే గుర్తింపు పొందాడు. కానీ ఆ సినిమా తరువాత లెక్కలన్నీ మారిపోయేట్టు చేశారు దర్శకుడు సుకుమార్. ఇప్పుడు గురువుని మించిన శిష్యుడిగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన(Butchi Babu Sana) ‘పెద్ది’ని తీర్చి దిద్దారు. ఐదేళ్ల గ్యాప్ తరువాత మళ్లీ థియేటర్ లలో కొత్త ఉత్సహాన్ని ‘ఉప్పెన’లా నింపి, రామ్ చరణ్‌తో కుస్తీ పట్టించి ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు సాన. రంగస్థలాన్ని మించే ‘పెద్ది’ ఉండబోతుందనే హోప్స్ కలిగించారు. మరి పెద్ది తో ఆడించిన ఆట.. బాక్సాఫీస్‌ని షేక్ చేసేది గా ఉందొ లేదో సమీక్షలో చూద్దాం.
ఇవి కూడా చదవండి
కథ :
130 కోట్ల జనాభా ఉన్న భారత్ ఒలంపిక్ క్రీడలో రెండు పతాకాలు సాధించడంపై అసంతృప్తిని వెళ్లగక్కే కేంద్ర మంత్రి సన్నివేశంతో ఆలోచింపచేసే విధంగా, పెద్ది భావోద్వేగాల మధ్య విజయనగరంలో క్రీడాకారులు ఎంపిక మొదలవుతుంది. క్రీడా సంఘం అధికారి (బోమన్ ఇరాని) విజయనగరం రావడంతో పెద్ది ఘనత ఆయన దృష్టికి వస్తుంది. పెద్ది జీవితం లో జరిగిన సన్నివేశాల సమాహారమే ఈ ఫ్లాష్ బ్యాక్ కథ.
1990ల కాలం బ్యాక్ డ్రాప్లో నడిచే కథ ‘పెద్ది’. ఊరు పేరే లేని కొండ ప్రాంతం ప్రజలు దగ్గరలో వున్నా విజయనగరం వలస వెళ్లి అందరూ బెల్లం తయారీ కంపెనీలో కూలీ పనులు చేస్తుంటారు. నెలకు నాలుగైదు రోజులు మాత్రం గ్రామంలో ఉంటారు. కొండ ఎక్కి దిగి మండలంలోకి రావాలంటే ఉదయించిన సూర్యుడు అస్తమించాల్సి వస్తుంది. ప్రభుత్వం లో ఎలాంటి ఓ గుర్తింపు లేని ఆ గ్రామస్తులు పొట్టకూటి కోసం కూలీ పనులు చేస్తుంటారు. ఇక కొండ ప్రాంతం మీదుగా వెళ్లే రైలు ఒక్క నిమిషం పాటు ఆగితే తమ బతుకులు మారుతాయ్ అని ముప్పై ఏళ్ల నుంచి అప్పలసూరి (జగపతి బాబు) పోరాటం చేస్తుంటాడు.ఇక ఊరి గ్రామస్తుల్లో పెద్ది (రామ్ చరణ్) ఆట కూలీగా మారి తన క్రికెట్ ఆటలో పెద్ది దిట్టగా గుర్తింపుని సంపాదించుకుంటాడు. ఆ ప్రాంతంలో ఉన్నత వర్గాలు చూపించే ఆర్థిక, సామాజిక వివక్షను ఎదుర్కొంటుంటాడు. ఆ బాధ కంటే తన ఊరికి, అక్కడ నివసించే ప్రజలకు గుర్తింపు లేకపోవడం ఇంకా బాధిస్తుంటుంది. ఆ ప్రాంతంలో ధనికులు ఆడే క్రికెట్ ఆట పందెంలో ‘ఆట కూలీ’గా పెద్ది క్రికెటర్‌గా తనకంటే సాటిలేని క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. మరో వైపు ఎన్నికల వైరంతో అచ్చియమ్మ (జాన్వీ కపూర్)ని రాంబుజ్జి (దివ్యేందు) దారుణంగా అవమానిస్తాడు.
నలుగురిలో అచ్చియమ్మ కు జరిగిన అవమానం చూసి రాంబుజ్జిని చితకబాదేస్తాడు. ఓ కూలీ వాడు తమను కొట్టడం ఏంటి? అని క్రికెట్ గ్రౌండ్లో సింహంలా తిరిగే పెద్దిని దారుణంగా ఒక రూపాయి పాటతో అవమానిస్తారు. ఇంకో వైపు అప్పలసూరి పోరాటం చేసి చేసి అలిసిపోయి చివరకు రైలుకి ఎదురుగా నిలబడి ప్రాణాలు వదిలేస్తాడు. అప్పల సూరికి జరిగిన అన్యాయం పెద్ది జీవితాన్ని పెద్ద మలుపు తిప్పుతుంది. క్రికెట్ ఆటను వదిలిపెట్టి కోడి రామ్మూర్తి నాయుడు శిష్యుడు గౌరీనాయుడు (శివరాజ్ కుమార్) వద్ద కుస్తీ విద్యను నేర్చుకొంటాడు. జాతీయ స్థాయిలో సెమీ ఫైనల్ వరకు వెళ్లి గెలుస్తాడు, అయితే విధి వక్రీకరించడంతో ఫైనల్ పోటీలో నిలబడలేక పోతాడు. తాను వున్న వూరు గుర్తింపు కోసం ఢిల్లీ వరకు వెళ్లి తన అభ్యర్ధనను ఆఫీసర్లకు మంత్రులకు విన్నవిస్తాడు కానీ ప్రయోజనం ఉండదు. కుస్తీ విద్యను వదిలేసి అథ్లెట్‌గా మారుతాడు. బెల్లం కంపెనీలో పెద్ది ఎలాంటి వివక్షను ఎదుర్కొంటాడు? గ్రామం కోసం అప్పలసూరి చేసే పోరాటం ఏమిటి? పెద్ది క్రికెట్ జీవితం ఎలా గడించింది? విజయనగరంలో రాంబూజీ తో వైరం ఏంటిది? ఆటే తన గుర్తింపు అనుకునే పెద్ది ఆ తర్వాత ఏం చేస్తాడు? అప్పలసూరి త్యాగం పెద్ది జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? కుస్తీ యోధుడు గౌరీ నాయుడు వద్ద కుస్తీ క్రీడను ఎందుకు నేర్చుకొంటాడు? జాతీయ స్థాయిలో బంగారు పతకం గెలిచే వరకు వెళ్లిన పెద్ది అథ్లెట్‌గా ఎందుకు మారాడు? అప్పలసూరి జీవితాశయాన్ని పెద్ది ఎలా సాధించాడు? ఆట నుంచి పెద్ది ఏం నేర్చుకున్నాడు.. అదే ఆట చివరికి అతనికి ఏమిచ్చింది.. ఏ కోల్పేయేట్టు చేసింది అనేదే కథ.
నటీనటుల హావభావాలు:
సినిమాలో పెద్ది లైఫ్ జర్నీ మూడు దశల్లో ఉంటుంది.. ఒక్కో దశకు ఒక్కో క్యారెక్టరైజేషన్, డిఫరెంట్ గెటప్ కనిపిస్తుంది. అయితే ఒక పాత్రని మంచి మరొక పాత్ర అన్నట్టుగా మూడు వేరియేషన్స్ చూపిస్తూ మైండ్ బ్లోయింగ్ నటనను కనిపించారు రామ్ చరణ్. యాక్టింగ్‌లో తండ్రిని మించిన తనయుడు అనేలా నటించాడు. అవార్డు లెవెల్ పెర్ఫార్మెన్స్తో కేక పెట్టించాడు. రంగస్థలం లో ఎలా చేసాడో మళ్లీ ఆ స్థాయిలో మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పేలా ‘పెద్ది’ పాత్రను పోషించాడు. తనకి కనెక్ట్ అయ్యే పాత్ర పడితే.. జీవించడం కాదు. ఆ పాత్రలో ఎంతలా లీనం కాగలడో ‘పెద్ది’తో చేసి చూపించాడు. ఆటే నా పొగరు అని డైలాగ్ చెప్పడమే కాదు.. ఆ బాడీ లాంగ్వేజ్‌లో కూడా ఆ పొగరు కనిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్ ఇలా ప్రతీ ఒక్క సీన్లో రామ్ చరణ్ అదరగొట్టేస్తాడు. జాన్వీ కపూర్ ఉన్నది కొంత సేపే. అయితే జాన్వీకి ఈ చిత్రం కెరీర్ పరంగా పెద్దగా ఉపయోగపడకపోవచ్చనిపిస్తుంది. దివ్యేందు శర్మ పాత్ర నుంచి ఆడియెన్స్ ఎక్కువగా ఆశిస్తే మాత్రం కచ్చితంగా భంగపడే అవకాశం ఉంది. జగపతి బాబు పాత్ర ఈ సినిమాకి ఆత్మ అయన జగపతి బాబు ఎక్కడ కనపడలేదు సూరి పాత్రలో జీవించేసాడు. శివ రాజ్ కుమార్ ఎంతో గంభీరంగా, హుందాగా అనిపిస్తాడు. బొమాన్ ఇరానీ పాత్రలో పెద్ద వేరియేషన్స్, ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా అనిపించదు. మిగిలిన పాత్రలన్నీ పర్వాలేదనిపిస్తాయి.
సాంకేతికవర్గం పనితీరు :
బుచ్చిబాబు సానా తాను రాసుకున్న కథకు అయితే న్యాయం చేశాడు. నిజాయితీతో ఓ కథను రాసుకుని అంతే హానెస్ట్ అటెంప్ట్ చేశాడు. కథలోని కీలకఘట్టాలన్నీ ఊహించినట్టుగానే అనిపించినా.. ఆ పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. సాంకేతికంగా పెద్ది ఎంతో గొప్ప స్థాయిలో కనిపిస్తుంది. విజువల్స్ అదిరిపోయాయి. ఈ సినిమాను ఓ రేంజ్లో నిలబెట్టిన వారిలో ఏఆర్ రెహ్మన్ ముందు ఉంటాడు. రెహమాన్ పాటలు తెరపై కనులపండువగా అనిపిస్తాయి. స్పోర్ట్స్ డ్రామాలో బలమైన భావోద్వేగాలు పలకాలంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వారధిగా మారాలి. బీజీఎం చాలా చోట్ల కొత్తగా వినిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ ప్రపంచస్థాయి మ్యూజిషియన్ అయినా కూడా.. ఆయన తెలుగులో నేరుగా చేసిన సినిమాలు మెప్పించలేకపోయాయి.
కానీ ‘పెద్ది’ సినిమాలోని చికిరి చికిరి పాటతో పటాపంచలు చేశారు ఏఆర్ రెహమాన్. అసలు ఈ పాటకి మ్యూజిక్ కొట్టింది ఈయనేనా? అన్నంతగా తెలుగు నేటివిటీకి తగ్గ ట్యూన్స్ ఇచ్చారు. రై రై రామా, హల్లో హల్లల్లో సాంగ్స్ కూడా మెప్పించాయి. మస్స, మస్స సాంగ్ అంచనాలను పెంచింది. చాలా వరకు రెహమాన్ ఆర్ఆర్ సినిమాని నిలబెట్టినట్టుగా అనిపిస్తుంది. క్యాస్టూమ్స్, పాటలు, మాటలు అన్నీ కూడా బాగుంటాయి. ఆర్ట్ కథలోకి తీసుకెళ్లే విధంగా వారు సృష్టించిన వాతావరణం చాలా బాగుంది. ఇక రత్నవేల్ సినిమాటోగ్రఫి ప్రతీ ఫ్రేమ్‌ను రిచ్‌గా, పెయింటింగ్‌గా మార్చింది. ఈ సినిమాకు ఎడిటర్లు పనిచేసిన తీరు చూస్తే కత్తిమీద సాములాంటి పనిని చక్కగా నిర్వర్తించారు. నిర్మాత కిలారు సతీష్ సినిమాపై ఉన్న అభురుచి ఏమిటో ఈ సినిమాను చూస్తే తెలుస్తుంది. రాజీలేని, ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాణ విలువలను అద్బుతంగా పాటించారు.
విశ్లేషణ :
పెద్ది.. ఓ కామన్ మ్యాన్ బయోపిక్‌లాంటి సినిమా. మారుమూల గ్రామం నుంచి జాతీయస్థాయికి ఎదిగిన క్రీడాకారుడి జీవితాన్ని బుచ్చిబాబు అద్బుతంగా చూపించే ప్రయత్నం చేశారు.పెద్ది పాత్రను చెక్కిన విధానం.. ఆ పాత్రలో రాంచరణ్ చూపించిన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేస్తాయి. లార్జర్ ద్యాన్ లైఫ్ క్యారెక్టర్, సినిమాలో ఇంకా బెటర్‌గా ఎమోషన్స్ జొప్పించి ఉంటే సినిమాకు తిరుగు ఉండేది కాదు. భారతీయ సినిమా పరిశ్రమలో ది బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా అయి ఉండేది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపిన పెద్ది లాంటి క్రీడాకారుడి గురించి క్రీడా అధికారికి తెలియకపోవడం అతిశయోక్తి, నమ్మశక్యంగా ఉండదు.
అప్పల సూరి చనిపోయినపుడు ఊరి జనాలు రైల్వే ట్రాక్ తగలపెట్టడం అనేది ఎమోషన్స్ తో ఆ సీన్ సృటించారు కానీ….. అది ఎంత వరకు సమంజసం అదే సమయం లో ఏదైనా ట్రైన్ వచ్చి ఉంటే ఎంత ప్రాణ నష్టం జరిగేదో అంత మంది లో ఒక్కడు కూడా ఆలోచించడా? కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు ఇలాంటి లాజిక్స్ వెదకకుండా… ఆడియెన్స్ పట్టించుకోకపోతే సినిమా ఫలితం ఓ రేంజ్లో ఉంటుంది. రన్ టైమ్ కారణంగా కొన్ని సన్నివేశాలు అర్ధాంతరంగా ముగిశాయా? కనెక్టవిటీ ఏదో మిస్ అయినట్టు అనిపిస్తాయి. కలెక్షన్లు మాత్రమే కాకుండా అవార్డులు కూడా తెచ్చిపెట్టే సినిమా పెద్ది. థియేటర్లోనే ఈ సినిమా చూస్తే బాగుంటుంది. రెగ్యులర్ సినీ లవర్స్‌కి ఓ మోస్తరుగా నచ్చినా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి మాత్రం సినిమా ఎక్కేస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది.








