ప్రకాష్ రాజ్‌పై బండ్ల గణేష్ ఫైర్
ప్రకాశ్ రాజ్(prakash raj), బండ్ల గణేష్(bandla ganesh) మధ్య సోషల్ మీడియా వేదికగా మరోసారి మాటల యుద్ధం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలు, సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల చేసిన ఓ ట్వీట్‌కు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)పై ప్రకాశ్ రాజ్ తరచూ విమర్శలు గుప్పించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలపై బండ్ల గణేష్ సోషల్ మీడియాలో బహిరంగంగా స్పందించడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.
తన సోషల్ మీడియా పోస్టులోబండ్ల గణేష్ , ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి పలు విమర్శలు చేశారు. మీ గురించి మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు. మీరే గొప్ప మేధావి అనుకుంటున్నారు. కానీ మీ రాష్ట్ర ప్రజల మద్దతు కూడా పొందలేకపోయారంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులను విమర్శించడం సులభమే కానీ, ముందు వ్యక్తిగత ప్రయాణం మరియు సాధించిన విజయాలను పరిశీలించుకోవాలని సూచించారు. కేవలం #JustAsking అనే ట్యాగ్‌తో ప్రశ్నలు వేయడం కంటే, అద్దం ముందు నిలబడి తనను తాను ప్రశ్నించుకోవాలని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, ఎత్తైన పర్వతాలపై రాళ్లు విసిరినంత మాత్రాన గౌరవం దక్కదంటూ ప్రకాశ్ రాజ్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, పవన్ కళ్యాణ్ అభిమానులు బండ్ల గణేష్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. సినీ రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖుల మధ్య కొనసాగుతున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడం గమనార్హం.








