కోటి మందితో యోగాంధ్ర : సీఎం చంద్రబాబు
ప్రతిష్ఠాత్మకంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. కార్యక్రమ నిర్వహణపై సచివాలయంలో చంద్రబాబు మాట్లాడారు. కోటి మందితో ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా యోగాడే (Yoga Day) నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. జూన్ 7 నుంచి 14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తాం. అమరావతి (Amaravati)లో జరిగే ప్రధాన కార్యక్రమంలో కృష్ణా నది (Krishna River) వెస్ట్ బైపాస్ వంతెనపై 25000 మందితో యోగా నిర్వహిస్తాం. ప్రతి జిల్లాకు ప్రత్యేక థీమ్ నిర్ణయించాం. రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా నిర్వహించి యోగా టూరిజాన్ని ప్రోత్సహిస్తాం అని వెల్లడించారు.
జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా బెస్ట్ మెడిసిన్. యోగాను మన జీవ న విధానంలో భాగం చేసేందుకు యోగాంధ్ర ద్వారా ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేందుకు యోగాను అనుసరించాలి అని చెప్పడమే దీని ఉద్దేశం. ఇది ఒక్క రోజు కార్యక్రమం కాదు. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి నిత్య సాధనగా అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యోగా ఒక శక్తివంతమైన ఉద్యమంగా మారాలి అని తెలిపారు.








