ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇక తెలంగాణలో పనులివ్వరా?
హైదరాబాద్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్ రేపిన దుమారం తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వివాదం కాస్తా ఇప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర స్థాయి సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసింది. ఆంధ్రా కాంట్రాక్టర్లను ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అత్యంత ఘాటుగా స్పందించారు. మంత్రి ఆ పని చేస్తే ఏకంగా తన పదవికే రాజీనామా చేస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ విసరారు.
తెలంగాణలో తమ లాంటి వాళ్లను రావద్దని కొంతమంది చెప్తున్నారని, కానీ తెలంగాణలో చాలా కాంట్రాక్టులు ఆంధ్రా వాళ్లే చేస్తున్నారని పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. పవన్ కల్యాణ్ ఇక్కడ లేనిపోని రాజకీయాలు మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. అదే ఊపులో ఒక సంచలన ప్రకటన చేశారు. “తెలంగాణలో ఆంధ్రా వాళ్లకు ఎవరికీ కూడా ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇవ్వం.. కావాలంటే దీనిపై ప్రత్యేకంగా అసెంబ్లీలో ఒక చట్టం కూడా తీసుకువస్తాం” అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల వ్యాపార, రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి మాటలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడుతూ నేరుగా కోమటిరెడ్డికి సవాల్ విసిరారు. “కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అంత సినిమా ఉంటే.. ఆయన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి, ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వకుండా అసెంబ్లీలో చట్టం తీసుకురావాలి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం గనుక నిజంగానే ఆ చట్టాన్ని తీసుకువస్తే.. నేను నా ఎమ్మెల్యే పదవికి ఉన్నపళంగా రాజీనామా చేయడానికి రెడీ!” అని తలసాని సవాల్ విసిరారు.
పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో ఒక చిన్న ఇండోర్ మీటింగ్ పెట్టుకుంటే దానికి కాంగ్రెస్ నేతలు ఇంతలా భయపడిపోయి పర్మిషన్ ఇవ్వకుండా డ్రామాలు ఆడుతున్నారని తలసాని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించి, లేని వివాదాన్ని కావాలనే పెద్దది చేసి మైలేజ్ పొందాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. మంత్రిగా ఉండి కోమటిరెడ్డి ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు రగిల్చేలా చట్టాలు తెస్తామని మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని తలసాని దుయ్యబట్టారు. రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ వ్యవస్థలో అలాంటి చట్టాలు తీసుకురావడం సాధ్యం కాదనే కనీస జ్ఞానం కూడా మంత్రికి లేదని ఆయన ఎద్దేవా చేశారు.
ముంచుకొస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ తరహా ‘సెంటిమెంట్ పాలిటిక్స్’కు తెరలేపిందని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. పవన్ కల్యాణ్‌ను ఒక ఆంధ్రా లీడర్ గా చూపించి, ఆయనను టార్గెట్ చేయడం ద్వారా ఇక్కడి ఓటర్లను మళ్లీ ప్రాంతాల వారీగా విడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
గడచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఆంధ్రా, తెలంగాణ అనే తేడా లేకుండా అందరూ ప్రశాంతంగా జీవించారని, వ్యాపారాలు చేసుకున్నారని తలసాని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే పాత విద్వేషాలను మళ్లీ తవ్వి తీస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి, పవన్ సభ చుట్టూ మొదలైన ఈ రచ్చ.. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సవాల్‌గా మారి తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది.








